సౌత్ ఇండియన్ కంపెనీపై కన్నేసిన అంబానీ.. ఆ బ్రాండ్ కొనేందుకు భారీ స్కెచ్..

సౌత్ ఇండియన్ కంపెనీపై కన్నేసిన అంబానీ.. ఆ బ్రాండ్ కొనేందుకు భారీ స్కెచ్..

గడచిన కొన్నేళ్లుగా రిలయన్స్ గ్రూప్ అనేక కొత్త బ్రాండ్లను కొనుగోలు చేస్తూ వ్యాపారాన్ని రిటైల్ విభాగంగా వేగంగా విస్తరిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా.. FMCG మార్కెట్‌లో తన పట్టును మరింత పెంచుకోవాలని చూస్తోంది. ఇందులో భాగంగా చెన్నైకి చెందిన ప్రముఖ ఆహార ఉత్పత్తుల సంస్థ 'ఉదయమ్స్ ఆగ్రో ఫుడ్స్'లో మెజారిటీ వాటా కొనేందుకు రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ చర్చలు జరుపుతోంది. సుమారు రూ. 668 కోట్ల వార్షిక టర్నోవర్ కలిగిన ఉదయమ్స్.. దక్షిణాదిలో ముఖ్యంగా పప్పు ధాన్యాలు, బ్రేక్‌ఫాస్ట్ మిక్స్‌లకు పెట్టింది పేరు. దీని ద్వారా ప్రాంతీయ మార్కెట్లలో ఇప్పటికే పాతుకుపోయిన బ్రాండ్ల ద్వారా జాతీయ స్థాయికి విస్తరించాలనే రిలయన్స్ వ్యూహం మరో అడుగు ముందుకు పడుతుంది.

చెన్నై కేంద్రంగా పనిచేసే ఉదయమ్స్ ఆగ్రో ఫుడ్స్ ప్రస్తుతం టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, ఐడీ ఫ్రెష్, MTR వంటి దిగ్గజ సంస్థలతో పోటీ పడుతోంది. పప్పులు, పిండి రకాలు, స్నాక్స్, 'రెడీ-టు-కుక్' బ్రేక్‌ఫాస్ట్ ఉత్పత్తుల్లో ఈ సంస్థకు బలమైన నెట్‌వర్క్ ఉంది. ఒప్పందం తర్వాత కూడా సంస్థ వ్యవస్థాపకులు ఎస్. సుధాకర్, ఎస్. దినకర్ మైనారిటీ వాటాను కలిగి ఉంటారు. ప్రాంతీయంగా బలంగా ఉన్న చిన్న బ్రాండ్లను కొనుగోలు చేయడం ద్వారా స్థానిక వినియోగదారులకు చేరువయ్యే వ్యూహాన్ని రిలయన్స్ ఇక్కడ అమలు చేస్తోంది.

Also read:- జియో 'హ్యాపీ న్యూ ఇయర్ 2026' అఫర్

రిలయన్స్ తన ఎఫ్ఎంసీజీ వ్యాపారాన్ని మరింత క్రమబద్ధీకరించడానికి ఇటీవల ఒక కీలక మార్పు చేసింది. రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ ను రద్దు చేసి.. దాని స్థానంలో 'న్యూ ఆర్‌సీపీఎల్' అనే కొత్త అనుబంధ సంస్థను డిసెంబర్ 1 నుండి అందుబాటులోకి తెచ్చింది. ఈ విభాగం కింద ఇప్పటికే క్యాంపా కోలా, ష్యూర్ వాటర్, లోటస్ చాక్లెట్, అలన్స్ బగ్లెస్ చిప్స్ వంటి ప్రముఖ బ్రాండ్లు ఉన్నాయి. ఆర్థిక సంవత్సరం 2025లో ఈ విభాగం ఆదాయం రూ.11వేల కోట్లు దాటింది. అలాగే దేశవ్యాప్తంగా ఫుడ్ మాన్యుఫ్యాక్చరింగ్ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వంతో రూ.40వేల కోట్ల ఒప్పందాన్ని కూడా రిలయన్స్ కుదుర్చుకుంది.

ప్రస్తుతం మార్కెట్‌లో చిన్న, డిజిటల్-ఫస్ట్ బ్రాండ్లు తక్కువ ధరలు, వేగవంతమైన డెలివరీతో పెద్ద కంపెనీలకు సవాలు విసురుతున్నాయి. అందుకే దిగ్గజ సంస్థలు ఇటువంటి వేగంగా ఎదుగుతున్న చిన్న కంపెనీలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నాయి. ఇటీవల మామా ఎర్త్ సంస్థ 'రెజినాల్డ్ మెన్'ను, గోద్రెజ్ కన్స్యూమర్ సంస్థ 'మూచ్‌స్టాక్' బ్రాండ్‌ను కొనటం ఈ ట్రెండ్‌కు నిదర్శనం. ఇప్పుడు రిలయన్స్ కూడా ఉదయమ్స్ ద్వారా దక్షిణాది మార్కెట్‌ను శాసించాలని భావిస్తోంది.