IPL 2026 Mini-auction: స్టార్క్ రికార్డ్ బద్దలు: కోల్‌కతాకే గ్రీన్.. రూ.25.20 కోట్లతో మినీ ఆక్షన్‌లో ఆసీస్ ఆల్‌రౌండర్‌ ఆల్‌టైం రికార్డ్

IPL 2026 Mini-auction: స్టార్క్ రికార్డ్ బద్దలు: కోల్‌కతాకే గ్రీన్.. రూ.25.20 కోట్లతో మినీ ఆక్షన్‌లో ఆసీస్ ఆల్‌రౌండర్‌ ఆల్‌టైం రికార్డ్

ఐపీఎల్ మినీ ఆక్షన్ లో ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ కామెరాన్ గ్రీన్ కు ఊహించినట్టుగానే రికార్డ్ ధర పలికింది. ఈ ఆసీస్ ఆల్ రౌండర్ ను రూ. 25.20 కోట్లతో కోల్‌కతా నైట్ రైడర్స్ దక్కించుకుంది. గ్రీన్ కోసం చెన్నై సూపర్ కింగ్స్, కేకేఆర్ జట్లు తీవ్రంగా పోటీపడ్డాయి. చివరికి కేకేఆర్ ఈ ఆసీస్ పవర్ హిట్టర్ ను దక్కించుకుంది. ఈ మినీ ఆక్షన్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ రూ. 64.3 కోట్లతో వేలంలోకి అడుగుపెడుతుంది. మరోవైపు చెన్నై రూ.43.4 కోట్లతో బరిలోకి దిగింది. చెన్నై చివరి వరకు పోరాడినా కేకేఆర్ ఈ ఆసీస్ ఆల్ రౌండర్ ను దక్కించుకుంది. 

ఆక్షన్ ముందు జడేజా సూపర్ కింగ్స్ జట్టు నుంచి రాజస్థాన్ కు వెళ్లిపోవడంతో గ్రీన్ పై చెన్నై కన్నేసింది. మరోవైపు కేకేఆర్ జట్టులో రస్సెల్ లేకపోవడంతో ఆ జట్టు ఫ్రాంచైజీ ఎలాగైనా గ్రీన్ ను దక్కించుకోవాలని చూసింది. అనుకున్నట్టుగానే ఈ రెండు జట్లు గ్రీన్ కోసం ఎంతకైనా ఖర్చు పెట్టేందుకు వెనకాడలేదు. ఐపీఎల్ మినీ వేలంలో ఇదే రికార్డ్ధర కావడం విశేషం. అంతకముందు ఆసీస్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ పేరిట ఈ రికార్డ్ ఉంది. 2024 ఐపీఎల్ మినీ వేలంలో  స్టార్క్ ను కేకేఆర్ రూ. 24.75 కోట్లకు దక్కించుకుంది.  
       

కామెరాన్ గ్రీన్ ఐపీఎల్ హిస్టరీ:

ఆస్ట్రేలియన్ స్టార్ ఆల్ రౌండర్ కామెరాన్ గ్రీన్ ఐపీఎల్‎లో ఆర్సీబీ, ముంబై ఫ్రాంచైజీలు తరుఫున ప్రాతినిథ్యం వహించాడు. క్యాచ్ రిచ్ లీగులో ఇప్పటి వరకు 29 మ్యాచులు ఆడిన గ్రీన్ ఒక సెంచరీ, రెండు హాఫ్ సెంచరీలతో సహా 41.5 సగటుతో 707 పరుగులు చేశాడు. ఫాస్ట్ బౌలింగ్‎తో పాటు టాప్ ఆర్డర్ నుంచి మిడిల్ ఆర్డర్ వరకు ఎక్కడైనా బ్యాటింగ్ చేయగల సామర్థ్యం ఉన్న గ్రీన్ వెన్నుముక గాయం కారణంగా 2025 ఐపీఎల్ సీజన్‎కు దూరమయ్యాడు. 

గాయం కారణంగా టోర్నీకి అందుబాటులో ఉండకపోవడంతో ఆర్సీబీ అతడిని రిటైన్ చేసుకోలేదు. గాయం నుంచి కోలుకుని తిరిగొచ్చిన ఈ ఆల్ రౌండర్ ఈ ఏడాది ఆసీస్ తరుఫున దుమ్మురేపుతున్నాడు. ఈ సంవత్సరం ఆడిన ఎనిమిది T20I లలో 169 స్ట్రైక్ రేట్‌తో సగటున 43 పరుగులు సాధించాడు. ఈ క్రమంలోనే ఐపీఎల్ వేలానికి కూడా తన పేరును రిజిస్టర్ చేసుకున్నాడు.