సిడ్నీలో కాల్పులు జరిపిన కిరాతకుల దగ్గర ఇండియన్ పాస్ పోర్ట్ ఎలా వచ్చింది..?

సిడ్నీలో కాల్పులు జరిపిన కిరాతకుల దగ్గర ఇండియన్ పాస్ పోర్ట్ ఎలా వచ్చింది..?

ఆస్ట్రేలియాలోని సిడ్నీ  బోండి బీచ్‌లో జరిగిన ఘోరమైన కాల్పుల వెనుక ఉన్న ఇద్దరు వ్యక్తులపై దర్యాప్తు కొనసాగుతోంది. వీళ్లు గత నెలలో ఫిలిప్పీన్స్‌కు వెళ్లి అక్కడ ఉగ్రవాద ఇస్లామిక్ బోధకులను కలిశారా లేదా సైనిక శిక్షణ పొందారా అనే కోణంలో అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ ఉగ్రవాదుల్లో ఒకరైన సాజిద్ అక్రమ్ (50) భారతీయ పాస్‌పోర్ట్‌ ఉపయోగించి ఫిలిప్పీన్స్‌కు వెళ్లినట్లు తెలుస్తుంది.

ఈ దాడిలో సాజిద్ అక్రమ్ (50), అతని కుమారుడు నవీద్ అక్రమ్ (24) హనుక్కా పండుగ జరుపుకుంటున్న యూదులను టార్గెట్ చేసుకుని కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 10 ఏళ్ల బాలిక, 87 ఏళ్ల వృద్ధుడు సహా మొత్తం 15 మంది చనిపోయారు. 

మనీలాలోని అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ తండ్రీ కొడుకులు సైనిక శిక్షణ కోసం నవంబర్ 1 నుంచి 28 మధ్య ఫిలిప్పీన్స్‌కు వెళ్లారు. విషయం ఏంటంటే సాజిద్ అక్రమ్ (50) భారతీయ పాస్‌పోర్ట్‌పై, అతని కుమారుడు నవీద్ (24) ఆస్ట్రేలియన్ పాస్‌పోర్ట్‌పై ప్రయాణించారు.

సాజిద్ అక్రమ్ పాకిస్తాన్‌లో పుట్టాడని భద్రతా నిపుణులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో  సాజిద్‌కు భారత పాస్‌పోర్ట్ ఎలా వచ్చింది ? అనేది ప్రస్తుతం కీలక ప్రశ్నగా మారింది. ఫిలిప్పీన్స్ ముఖ్యంగా అక్కడి దక్షిణ ప్రాంతం ఇస్లామిక్ ఉగ్రవాద గ్రూపులకు, తీవ్రవాద మతపెద్దలకు స్థావరంగా ఉంది. అక్కడ చాలా ఇస్లామిక్ సాయుధ సంస్థలు IS (ఇస్లామిక్ స్టేట్) పట్ల కమిట్మెంట్ ప్రకటించాయి.

ఆస్ట్రేలియన్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ (ABC) ప్రకారం ఈ తండ్రీ కొడుకులు నవంబర్ మొదట్లో ఫిలిప్పీన్స్ చేరుకుని,  సైనిక తరహా శిక్షణ కోసం దక్షిణ ఫిలిప్పీన్స్‌కు వెళ్లారని ఒక అధికారి తెలిపారు. ఈ దాడులకు అంతర్జాతీయ జిహాదీ నెట్‌వర్క్‌తో సంబంధాలు ఉన్నాయా అనే దానిపై కూడా అధికారులు ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నారు.

ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి ఆంథోనీ అల్బనీస్ ఈ దాడి ఇస్లామిక్ స్టేట్ భావజాలం ప్రేరణతో జరిగిందని అన్నారు. ఆస్ట్రేలియాలో పుట్టిన నవీద్ 2019లోనే ఐఎస్ సంబంధాల అనుమానంతో భద్రతా సంస్థల నిఘాలోకి వచ్చాడు, కానీ తరువాత అతని పై ఎలాంటి నిఘా లేకుండా విడిచిపెట్టారని తెలుస్తోంది.

ఈ దాడి జరుగుతున్నప్పుడు ఇద్దరు యూదులను కాల్చి చంపుతుండగా కూడా ఆస్ట్రేలియా పోలీసులు స్పందించకుండా ఉన్నారని ప్రత్యక్ష సాక్షులు చెబుతూతున్నారు. కాల్పుల దృశ్యాలు చూసిన కొందరు ఈ ఇద్దరు ఉగ్రవాదులు సాధారణ షూటర్లలా లేరు అని కూడా  అన్నారు.