T20 World Cup 2026: USAతో ఇండియా 'ఏ' వార్మప్ మ్యాచ్.. అందరి దృష్టి అతడిపైనే.. లైవ్ స్ట్రీమింగ్ ఎందులో చూడాలంటే..?

T20 World Cup 2026: USAతో ఇండియా 'ఏ' వార్మప్ మ్యాచ్.. అందరి దృష్టి అతడిపైనే.. లైవ్ స్ట్రీమింగ్ ఎందులో చూడాలంటే..?

ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026 వార్మప్ మ్యాచ్ లకు రంగం సిద్ధమైంది. సోమవారం (ఫిబ్రవరి 2) నుంచి వార్మప్ మ్యాచ్ లు ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగా నేడు ఇండియా ఏ (ఫిబ్రవరి 2) యూఎస్ఏతో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ లో ఇండియా సీనియర్ జట్టు ఆడడం లేదు. చిన్న జట్టు కావడంతో బీసీసీఐ భారత 'ఏ' జట్టును ప్రకటించింది. జియో హాట్‌స్టార్ యాప్, స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లోవార్మప్ మ్యాచ్ లు ప్రత్యక్ష ప్రసారమవుతాయి. మ్యాచ్ సాయంత్రం 5:00 గంటలకు ప్రారంభమవుతుంది. డీవై పాటిల్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. 

అందరి దృష్టి తిలక్ వర్మపైనే:

USAతో నేడు జరగబోయే మ్యాచ్ లో అందరి కళ్ళు టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాటర్ తిలక్ వర్మపైనే ఉన్నాయి. గత నెలలో విజయ్ హజారే ట్రోఫీ ఆడుతూ తిలక్ గాయపడ్డాడు. ఈ క్రమంలో న్యూజిలాండ్ తో జరిగిన ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ కు దూరమయ్యాడు. పూర్తి ఫిట్ నెస్ సాధించిన ఈ హైదరాబాదీ కుర్రాడు వార్మప్ మ్యాచ్ లో రాణించి గాడిలో పడాలని టీమిండియా యాజమాన్యం భావిస్తుంది. తిలక్ వరల్డ్ కప్ స్క్వాడ్ లో ఉండడంతో తనను తాను నిరూపించుకోవడం ఈ యంగ్ ప్లేయర్ కు చాలా కీలకం. తిలక్ తో పాటు రవి బిష్ణోయ్, రియాన్ పరాగ్ కూడా వరల్డ్ కప్ స్క్వాడ్ లో సుందర్ స్థానంలో ఎంపికయ్యే అవకావం ఉంది. దీంతో వీరిద్దరూ రాణించడం తప్పనిసరి. 

సోమవారం (ఫిబ్రవరి 2) నుంచి ఫిబ్రవరి 6 వరకు వార్మప్ మ్యాచ్ లు జరుగుతాయి. మొత్తం 5 రోజుల పాటు 15 మ్యాచ్ ల షెడ్యూల్ ను ఏర్పాటు చేశారు. మొత్తం మూడు వార్మప్ మ్యాచ్ లు టీమిండియా ఆడాల్సి ఉంది. ఇండియా ఫిబ్రవరి 4 న సౌతాఫ్రికాతో వార్మప్ మ్యాచ్ ఆడుతుంది. ఇండియా వరల్డ్ కప్ లో ఆడబోయే లీగ్ మ్యాచ్ కు మూడు రోజుల ముందు డీవై పాటిల్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. మ్యాచ్ సాయంత్రం 7 గంటలకు జరుగుతుంది. అమెరికా, నమీబియాలతో జరగబోయే వార్మప్ మ్యాచ్ ల కోసం సీనియర్ జట్టు కాకుండా ఇండియా 'ఏ' జట్టు ఆడనుంది. 

బీసీసీఐ భారత 'ఏ' జట్టును సోమవారం (ఫిబ్రవరి 2) ప్రకటించింది. భారత ఏ జట్టుకు బదోనీ కెప్టెన్సీ చేయనున్నాడు. స్క్వాడ్ లో తిలక్ వర్మను కూడా ఎంపిక చేశారు. మన్ ధీర్, అశుతోష్ శర్మ, ప్రియాంష్ ఆర్య, ఉర్విల్ పటేల్, పరాగ్ జట్టులో సత్తా చాటడానికి సిద్ధమయ్యారు. ఇటీవల న్యూజిలాండ్ తో జరిగిన టీ20 సిరీస్ లో ఆడిన రవి బిష్ణోయ్‌ ని ఎంపిక చేశారు. మానవ్ సుతార్, విప్రజ్ నిగమ్‌ రూపంలో ఇద్దరు స్పిన్-బౌలింగ్ ఆల్ రౌండర్లు ఉన్నారు. గుర్జప్నీత్ సింగ్, ఖలీల్ అహ్మద్, మయాంక్ యాదవ్, అశోక్ శర్మ లతో పేస్ విభాగాన్ని ఎంపిక చేశారు.