68వ గ్రామీ అవార్డుల వేడుకలో 90 ఏళ్ల ఆధ్యాత్మిక గురువు అయిన దలైలామా మొదటి గ్రామీ అవార్డును అందుకున్నారు. ఫిబ్రవరి 1న లాస్ ఏంజిల్స్‌లో జరిగిన ఈ వేడుకలో ఆయన ఈ అవార్డు అందుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. దలైలామా రూపొందించిన 'మెడిటేషన్: ది రిఫ్లెక్షన్స్ ఆఫ్ హిస్ హోలీనెస్ ది దలైలామా' అనే ఆడియోబుక్‌కు నేరేషన్ అండ్ స్టోరీటెల్లింగ్ విభాగంలో ఉత్తమ ఆడియో బుక్ అవార్డు లభించింది. ఇందులో ఆయన చెప్పిన శాంతి సందేశాలకు తోడుగా అద్భుతమైన సంగీతాన్ని అందించారు.
ఈ ఆడియోబుక్‌లో శాంతి, కరుణ, పర్యావరణం, మానవత్వం గురించి దలైలామా తన ఆలోచనలను పంచుకున్నారు. ప్రముఖ సరోద్ విద్వాంసుడు అమ్జాద్ అలీ ఖాన్ ఇంకా ఆయన కుమారులు అమాన్, అయాన్ ఈ ప్రాజెక్టుకు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని అందించారు. ఈ విభాగంలో ట్రెవర్ నోహ్ వంటి ప్రముఖులతో దలైలామా పోటీ పడి విజేతగా నిలిచారు.
ఆగస్టు 2025లో ఈ ఆడియోబుక్ విడుదలైంది. వయస్సు రీత్యా దలైలామా స్వయంగా వేడుకకు వెళ్లలేకపోయినా, ఆయన తరపున ఇతర బృందం సభ్యులు ఈ అవార్డును అందుకున్నారు. కేవలం మతపరమైన గురువుగానే కాకుండా, తన మాటలతో ప్రపంచాన్ని ఎలా ప్రభావితం చేయవచ్చో ఈ అవార్డు నిరూపించింది.
1989లో ఆయనకు నోబెల్ శాంతి బహుమతి కూడా వచ్చింది. ఈ వేడుకలోనే ప్రముఖ దర్శకుడు స్టీవెన్ స్పీల్‌బర్గ్ కూడా మొదటి గ్రామీని అందుకున్నారు. పాప్, రాప్ సంగీతం ఎక్కువగా వినిపించే గ్రామీ వేదికపై, దలైలామా శాంతి సందేశం వినపడటం విశేషం. దలైలామా 90వ పుట్టినరోజు తరువాత ఆగస్టు 2025లో 'మెడిటేషన్: ది రిఫ్లెక్షన్స్ ఆఫ్ హిస్ హోలీనెస్ ది దలైలామా' అనే ఆడియోబుక్ విడుదలైంది.
