కనీస వేతనం రూ.35వేలు ఇవ్వండి: పీఆర్సీ కమిషన్​కు పీఆర్టీయూ వినతి

కనీస వేతనం రూ.35వేలు ఇవ్వండి: పీఆర్సీ కమిషన్​కు పీఆర్టీయూ వినతి

హైదరాబాద్, వెలుగు: ఉద్యోగులకు కనీస వేతనం రూ.35 వేలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు పింగిలి శ్రీపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బీరెల్లి కమలాకర్ రావు కోరారు. మంగళవారం పీఆర్సీ కమిషన్ చైర్మన్ శివశంకర్ ను ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి, మాజీ ఎమ్మెల్సీలు మోహన్ రెడ్డి, పూల రవీందర్ తదితరులతో కలిసి వినతిపత్రం అందించారు. 50శాతం ఫిట్ మెంట్ తో పీఆర్సీ ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. సీపీఎస్ రద్దు చేసి పాత పింఛన్ విధానాన్ని అమలు చేయాలన్నారు. సమగ్ర శిక్ష ఉద్యోగులందరికీ మినిమమ్ టైమ్ స్కేల్ ఇవ్వాలని కోరారు.ఎస్జీటీలకు 13వ గ్రేడ్ వేతన స్కేల్ ఇవ్వాలని, మోడల్ స్కూల్ పీజీటీలకు జూనియర్ లెక్చరర్లతో సమానంగా 21వ గ్రేడ్ వేతన స్కేల్ అమలు చేయాలని రిక్వెస్ట్ చేశారు.  

30% ఫిట్ మెంట్ తగ్గకుండా ఇవ్వాలె: యూటీఎఫ్ 

రాష్ట్ర జీఎస్డీపీ వృద్ధికి అనుగుణంగా ఉద్యోగ, ఉపాధ్యాయులకు గౌరవప్రదమైన వేతనాలు నిర్ణయించాలని ప్రభుత్వాన్ని టీఎస్​యూటీఎఫ్​ రాష్ట్ర అధ్యక్షుడు జంగయ్య, ప్రధాన కార్యదర్శి చావ రవి విజ్ఞప్తి చేశారు.  ఈ మేరకు మంగళవారం పీఆర్సీ కమిషన్ చైర్మన్ ను సంఘం రాష్ట్ర నేతలు టి.లక్ష్మారెడ్డి, వెంకట్, రాజశేఖర్ రెడ్డి, మాణిక్ రెడ్డితో కలిసి వినతిపత్రం అందించారు. 30% తగ్గకుండా ఫిట్ మెంట్ ఇవ్వాలని,  కనీస వేతనం రూ.30వేలు ఇవ్వాలని కోరారు. 

35% హెచ్ఆర్ఏ ఇవ్వాలె: ఎస్టీయూ 

ఉద్యోగులకు కనీస వేతనం రూ.32వేలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు పర్వత్ రెడ్డి, కార్యదర్శి సదానందంగౌడ్ కోరారు. పీఆర్సీ కమిషన్ చైర్మన్ శివశంకర్ ను సంఘం ప్రతినిధులతో కలిసి వినతిపత్రం అందించారు. రెండో పీఆర్సీని 2023, జులై 1 నుంచి 40% ఫిట్ మెంట్ తో ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో 35% , మున్సిపల్ కార్పొరేషన్ పరిధుల్లో 30%, జిల్లా కేంద్రాల్లో 25 శాతం హెచ్ఆర్ఏ ఇవ్వాలని రిక్వెస్ట్ చేశారు.