కవిత కస్టడీ పొడిగింపు

కవిత కస్టడీ పొడిగింపు
  • ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో 4వ సారి ఎక్స్ టెండ్ చేసిన ట్రయల్ కోర్టు
  • ఈడీ కేసులో ఈ నెల 14, సీబీఐ కేసులో ఈ నెల 20 వరకు కస్టడీ
  • కవితకు హోంఫుడ్ ఇచ్చేందుకు పర్మిషన్ కోరిన అడ్వకేట్లు

న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు రౌస్ ఎవెన్యూ కోర్టు నాలుగో సారి జ్యుడీషియల్ కస్టడీ విధించింది. మనీలాండరింగ్ కు సంబంధించిన ఈడీ కేసులో ఈ నెల 14 వరకు.. సీబీఐ కేసులో ఈ నెల 20 వరకు కస్టడీ పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. ఈడీ, సీబీఐ కేసులో విధించిన జ్యుడీషియల్ కస్టడీ ముగియడంతో.. మంగళవారం మధ్యాహ్నం కవితను స్పెషల్ జడ్జి కావేరి బవేజా ముందు హాజరుపరిచారు. తొలుత ఈడీ కేసులో వాదనలు జరగ్గా.. ఈడీ తరఫున పీపీ ఎన్ కే మట్ట కేసు పురోగతిని కోర్టుకు వివరించారు. ప్రస్తుతం దర్యాప్తు కీలక దశలో ఉన్నందున కవిత కస్టడీని పోడిగించాలని కోరారు. ఈడీ వాదనలను పరిగణనలోకి తీసుకొని కవిత జ్యుడీషియల్ కస్టడీని ఈ నెల 14 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

సీబీఐ కేసులో ఈ నెల 20 వరకు కస్టడీ...

సీబీఐ కేసులో కస్టడీపై అరగంట తర్వాత మరోసారి కవితను కోర్టు ముందు ప్రొడ్యూస్ చేశారు. సీబీఐ తరఫున పీపీ పంకజ్ గుప్తా వాదనలు వినిపించారు. కేసు వ్యవహారంలో మరింత మందిని విచారించాల్సి ఉందన్నారు.  దర్యాప్తు సజావుగా సాగేలా.. కవిత కస్టడీని పొడిగించాలని కోరారు. ఈ అంశాలను పరిగణలోకి తీసుకొన్న బెంచ్.. కవిత జ్యుడీషియల్ కస్టడీని ఈ నెల 20 వరకు పొడిగిస్తున్నట్టు వెల్లడించింది. 

రేవణ్ణను దేశం దాటించి.. నాలాంటి వాళ్లను అరెస్ట్ చేస్తరా: కవిత

ప్రజ్వల్ రేవణ్ణ లాంటి వారిని దేశం దాటించి.. తన లాంటి వాళ్లను అరెస్ట్ చేయడం అన్యాయమని కవిత అన్నారు. ఈ విషయాన్ని ప్రజలందరూ గమనించాలని ఆమె కోరారు. 

బెయిల్ పై నేడు హైకోర్టును ఆశ్రయించనున్న కవిత

ఈడీ, సీబీఐ కేసుల్లో రౌస్ ఎవెన్యూ కోర్టు బెయిల్ నిరాకరించడంతో నేడు కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించనున్నారు. ఈ మేరకు కవిత అరెస్ట్ ను చాలెంజ్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు ఆమె భర్త అనిల్ తెలిపారు.