రాజకీయ స్వార్థం కోసం ద్వేషం పెంచుతున్నరు: మోదీ, బీజేపీపై సోనియా ఫైర్​

రాజకీయ స్వార్థం కోసం ద్వేషం పెంచుతున్నరు: మోదీ, బీజేపీపై సోనియా ఫైర్​
  • ప్రమాదంలో రాజ్యాంగం
  • ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీలు వివక్షకు గురవుతున్నరు
  • ద్వేషాన్ని, అబద్ధాలను తిరస్కరించండి
  • అన్ని వర్గాల ఉన్నతి కోసం కాంగ్రెస్​ను గెలిపించాలని పిలుపు

న్యూఢిల్లీ: రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీ, ప్రధాని నరేంద్ర మోదీ దేశంలో ద్వేషాన్ని పెంచుతున్నారని కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ మండిపడ్డారు. ఎలాగైనా అధికారం సాధించడమే వారి ఉద్దేశమన్నారు. వారు చెప్తున్న అబద్ధాలు, ద్వేషాన్ని తిరస్కరించాలని ప్రజలను కోరారు. మంగళవారం సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ అధికారిక ‘ఎక్స్’ ఖాతా​లో తన వీడియో సందేశం పోస్ట్​ చేశారు. “ఈ రోజు దేశం నలుమూలలా యువత నిరుద్యోగంతో ఇబ్బందులు పడుతోంది. భద్రత కరువై మహిళలు అఘాయిత్యాలకు గురవుతున్నారు.  ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీలు తీవ్ర వివక్షను ఎదుర్కొంటున్నరు. ప్రధాని మోదీ, బీజేపీ ఆలోచనాతీరు వల్లే దేశంలో ఈ దుస్థితి నెలకొంది. ఎట్టిపరిస్థితుల్లోనూ అధికారాన్ని పొందడమే వారి టార్గెట్” అని అందులో సోనియా పేర్కొన్నారు.

న్యాయ్​ పత్రం దేశాన్ని ఏకం చేస్తుంది

“కాంగ్రెస్ పార్టీ, నేను ఎల్లప్పుడూ అందరి డెవలప్​మెంట్, అణగారిన వర్గాలకు న్యాయం, దేశాన్ని బలోపేతం చేయడం కోసం పోరాడినం. రాజ్యాంగం, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి కాంగ్రెస్, ఇండియా కూటమి అంకితమైంది’’ అని సోనియా పేర్కొన్నారు. “మన రాజ్యాంగం, ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది, మధ్యతరగతి, పేదలు పూర్తిగా నిర్లక్ష్యానికి గురవుతున్నరు. మన సమాజం చిన్నాభిన్నమవడం ఆవేదన కలిగిస్తున్నది. నేను మరోసారి మీ మద్దతును కోరుతున్న. మా ‘న్యాయ్ పత్రం’, హామీలు దేశాన్ని ఏకం చేస్తాయి. పేదలు, యువత, మహిళలు, రైతులు, కార్మికులు, వెనుకబడిన వర్గాల ఉన్నతే లక్ష్యంగా పెట్టుకున్నం” అని సోనియా అన్నారు. ఉజ్వల భవిష్యత్తు కోసం కాంగ్రెస్‌‌‌‌కు ఓటు వేయాలని ప్రజలకు ఆమె విజ్ఞప్తి చేశారు.  అందరం కలిసి శాంతి, సామరస్యంతో కూడిన బలమైన ఇండియాను నిర్మిద్దామని చెప్పారు.