కావాల్సినంత కరెంట్ ఉంది; భట్టి విక్రమార్క

కావాల్సినంత కరెంట్ ఉంది;  భట్టి విక్రమార్క

రాష్ట్రంలో కావాల్సినంత కరెంటు అందుబాటులో ఉందని, బీఆర్ఎస్​ నేతలు చేస్తున్న దుష్ర్పచారాన్ని ప్రజలు నమ్మరని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంగళవారం ఓ ప్రకటనలో అన్నారు. వేసవి నేపథ్యంలో డిమాండ్​ పెరిగినా వినియోగదారులకు నిరంతరం కరెంట్  సరఫరా చేస్తున్నామని ఆయన చెప్పారు. నిరుటి కన్నా ఈసారి 52.9 శాతం ఎక్కువే కరెంటు సరఫరా చేశామని పేర్కొన్నారు. నిరుడు మే నెల 1 నుంచి 6 వరకు 7,062 మెగావాట్లు ఉన్న డిమాండ్  ఈసారి 10,799 మెగావాట్లకు పెరిగిందన్నారు. 

అలాగే సగటు కరెంటు వినియోగం నిరుడు ఇదే టైమ్​లో 157.9 మిలియన్  యూనిట్లు  ఉండగా నేడు  226.62 మిలియన్  యూనిట్లకు పెరిగిందన్నారు. గ్రేటర్  హైదరాబాద్  పరిధిలో ఈ ఏడాది మే 1 నుంచి 6  వరకు నమోదయిన సగటు డిమాండ్, వినియోగాన్ని గత సంవత్సరంతో పోలిస్తే 47.6  శాతం పెరిగిందన్నారు. 2023 మేలో 2,830 మెగావాట్లుగా ఉన్న సగటు డిమాండ్  ఈసారి 4,177 మెగావాట్లకు పెరిగిందని తెలిపారు. 

అలాగే సగటు కరెంటు వినియోగం కూడా 57.5 మిలియన్  యూనిట్ల నుంచి 88 మిలియన్  యూనిట్లకు చేరిందని తెలిపారు. విధి నిర్వహణలో కృషి చేస్తున్న విద్యుత్​ సిబ్బందిని అభినందించాల్సిన ప్రతిపక్షాలు లేని కరెంటు కోతలను ఉన్నట్లు ప్రచారం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. సూర్యాపేటలో బీఆర్ఎస్  నేతలు ఏర్పాటు చేసుకున్న జనరేటర్  లోపంతో కరెంటు పోయినా దాన్ని విద్యుత్  శాఖ మీద వేశారని ఎద్దేశా చేశారు.