
- పార్టీ మారినోళ్లపై దాసోజు ఫైర్
- కాంగ్రెస్‌లో చేరే ఆలోచనను నాన్న విరమించుకోవాలి
హైదరాబాద్, వెలుగు: పార్టీ మారిన వారు ఆత్మగౌరవం గురించి మాట్లాడటం సిగ్గుచేటని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రావణ్ అన్నారు. దానం నాగేందర్‌కు బీఆర్‌ఎస్‌లో అన్ని విధాలా గౌరవించామని పేర్కొన్నారు. ఆయనకు ఏం ఆత్మగౌరవం దక్కలేదో దానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేశవరావు కుమారుడు కె.విప్లవ్ కుమార్‌తో కలిసి శుక్రవారం తెలంగాణ భవన్‌లో మీడియాతో శ్రావణ్ మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే నిండిన చెరువుల్లోకి కప్పలు వెళ్లినట్లుగా బీఆర్ఎస్ నాయకులు పోతున్నారని ఎద్దేవా చేశారు. నాగేందర్‌ను రేవంత్ రెడ్డి బీడీలు అమ్ముకునేటోడు అన్నారని, కేటీఆర్ అలాంటి మాటలు ఎప్పుడైనా మాట్లాడారా అని అడిగారు. కేశవరావు, కడియం శ్రీహరి, నాగేందర్ తమ పదవులకు రాజీనామా చేయాలని శ్రావణ్ డిమాండ్ చేశారు. విప్లవ్ కుమార్ మాట్లాడుతూ.. పార్టీ కష్టకాలంలో ఉండగా తన తండ్రి కేకే బీఆర్ఎస్‌ను వీడడం సరికాదన్నారు. ఇప్పటికైనా మరోసారి ఆలోచించి కాంగ్రెస్‌లో చేరాలన్న నిర్ణయాన్ని తన తండ్రి మార్చుకోవాలని కోరారు. సోదరి విజయలక్ష్మి మేయర్ పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరాలని డిమాండ్ చేశారు. తాను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్‌ను వీడనని విప్లవ్ చెప్పారు.