
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ గవర్నర్ విరల్ ఆచార్య తన పదవికి రాజీనామా చేశారు. పదవికాలం గడువుకు ఆరునెలల ముందుగానే ఆయన పదవిని వదులుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. 2017 జనవరి 23న విరల్ ఆచార్య.. RBI డిప్యూటీ గవర్నర్ గా బాధ్యతలు తీసుకున్నారు. గతంలో గవర్నర్ గా పనిచేసిన ఉర్జిట్ పటేల్ వెళ్లిపోయినప్పటి నుంచి.. విరల్ ఆచార్య ఆర్బీఐలో ఆసౌకర్యంగా ఉన్నట్టు తెలుస్తోంది.
గవర్నర్ తో విభేదాలు
ప్రస్తుతం ఉన్న ఆర్బీఐ టీం విధానాలు.. విరల్ ఆచార్యకు నచ్చడం లేదనే మాట వినిపిస్తోంది. ఈ మధ్య జరిగిన మానిటరీ పాలసీ మీటింగుల్లో… గవర్నర్ శక్తికాంతదాస్ నిర్ణయాలతో విరల్ ఆచార్య విభేదించారని సమాచారం. ఆర్థికలోటుపై ఇద్దరి మధ్య చిన్నపాటి వాగ్వాదం కూడా జరిగిందనే మాట వినబడుతోంది. ప్రస్తుత గవర్నర్ శక్తికాంతదాస్ తో కలిసి పనిచేసే పరిస్థితి లేకపోవడంతోనే విరల్ ఆచార్య తన పదవికి రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. అయితే.. ఆర్బీఐ నుంచి తప్పుకున్న విరల్ ఆచార్య.. బోధనా రంగం వైపు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. న్యూయార్క్ విశ్వవిద్యాలయంలో ఆయన జాయిన్ కాబోతున్నారని.. సన్నిహితులు చెబుతున్నారు.