
భారత క్రికెట్ ప్రస్తానం వస్తే విరాట్ కోహ్లీ ముందు వరుసలో ఉంటాడు. అతను క్రికెట్ లో సాధించిన ఘనతలే అందుకు నిదర్శనం. ఫార్మాట్ ఏదైనా నిలకడగా రాణించడం కోహ్లీ ప్రత్యేకత. ఫార్మాట్ కు తగ్గట్టు తన టేక్నీక్ మార్చుకుంటూ పరుగుల వరద పారించడం కోహ్లీకి వెన్నతో పెట్టిన విద్య. వన్డే, టీ20 ఫార్మాట్ లో లెక్కకలేనన్ని రికార్డులు తన ఖాతాలో వేసుకున్న విరాట్.. టెస్ట్ క్రికెట్ లో కాస్త వెనక పడ్డట్టే కనిపిస్తోంది. వైట్ బాల్ క్రికెట్ లో కోహ్లీ దిగ్గజ హోదా పొందిన టెస్ట్ క్రికెట్ లో మాత్రమే ఇంకా ఆ స్థాయికి చేరుకోలేదని తెలుస్తోంది.
విరాట్ టెస్టుల్లో ఇంకా 10000 పరుగులు చేయకపోవడమే దానికి కారణం. టెస్ట్ ఫార్మాట్ లో ఇప్పటివరకు 123 టెస్టుల్లో 210 ఇన్నింగ్స్ లు ఆడిన కోహ్లీ.. 46.85 యావరేజ్ తో 9230 పరుగులు చేశాడు. వీటిలో 30 సెంచరీలతో పాటు 51 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కింగ్ మరో 770 పరుగులు చేస్తే టెస్ట్ క్రికెట్ లో 10 వేల పరుగుల క్లబ్ లోకి చేరతాడు. కానీ ప్రస్తుతం కోహ్లీ టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాలనుకున్నటుగా బీసీసీఐకి చెప్పినట్టు సమాచారం. అదే జరిగితే టెస్టుల్లో 10 వేల పరుగుల అరుదైన ఘనతను కోల్పోతాడు.
అప్పుడు కోహ్లీని కొంతమంది హేటర్స్ లెజెండ్ కాదని విమర్శలు చేసినా ఆశ్చర్యం లేదు. 2017 వరకు కోహ్లీ టెస్ట్ కెరీర్ టాప్ లో ఉంది. దాదాపు 55 యావరేజ్ తో టెస్ట్ క్రికెట్ చరిత్రలో వన్ ఆఫ్ ది బెస్ట్ బ్యాటర్ గా పేరు తెచ్చుకున్నాడు. అయితే 2020 తర్వాత టెస్ట్ క్రికెట్ లో కోహ్లీ ఆట మందగించింది. ఒకటి రెండు అడపా దడపా ఇన్నింగ్స్ లు మినహాయిస్తే కోహ్లీ స్థాయి ఇన్నింగ్స్ ల కోసం ఫ్యాన్స్ చాలా కాలమే ఎదురు చూశారు. ఒక మంచి ఇన్నింగ్స్ ఆడిన తర్వాత అతని నుంచి మరో గొప్ప ఇన్నింగ్స్ రావడానికి చాలా సమయం పడుతుంది.
అలవోకగా సెంచరీ బాదే కోహ్లీ.. హాఫ్ సెంచరీ చేయడానికి ఇబ్బందిపడుతున్నాడు. విరాట్ తన టెస్ట్ క్రికెట్ నిర్ణయాన్ని ఉపసంహరించుకొని ఇంగ్లాండ్ సిరీస్ లో ఆడాలని బీసీసీఐతో పాటు యావత్ దేశం కోరుకుంటుంది. ఇంగ్లాండ్ తో జూన్ 20 నుంచి టీమిండియా 5 మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో తలపడనుంది. ఈ మెగా సిరీస్ కు ముందు కోహ్లీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.