భారత రెజ్లర్‌ను గెలవలేక చేయి కొరికిన ప్రత్యర్థి

భారత రెజ్లర్‌ను గెలవలేక చేయి కొరికిన ప్రత్యర్థి

టోక్యో: ఒలింపిక్స్‌‌లో భారత రెజ్లర్ రవికుమార్ దహియా సిల్వర్ మెడల్ సాధించాడు. దాంతో భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. 57కేజీల విభాగంలో రష్యన్ రెజ్లర్ జౌర్ గేవ్‌తో జరిగిన ఫైనల్స్‌లో.. 7-4 తేడాతో రవి కుమార్ ఓడిపోయాడు. రష్యన్ రెజ్లర్‌కు రవి కుమార్ తీవ్ర పోటీ ఇచ్చాడు. రెజ్లింగ్‌లో 9 ఏళ్ల తర్వాత భారత్ తరపున ఫైనల్స్‌కు చేరిన రెండో ఆటగాడిగా రవి కుమార్ దహియా రికార్డ్ సృష్టించాడు. 

కాగా.. రవి కుమార్ సెమీఫైనల్‌లో కజకిస్థాన్‌కు చెందిన నూరిస్లామ్ సనయేవ్‌ను ఓడించాడు. ప్రత్యర్థి 2-9 తేడాతో వెనుకబడటంతో ఎలాగైనా పట్టు వదలకూడదని భావించిన రవి.. సెమీ ఫైనల్ బౌట్ చివరి కొన్ని సెకన్ల ముందు.. కజకిస్థాన్ ఆటగాడిని కాలు పట్టి పడేసే ప్రయత్నం చేశాడు. దాంతో పట్టు కోల్పోయిన ప్రత్యర్థి.. రవి కుమార్ చేతిని గట్టిగా కొరికాడు. అంపైర్ టైమ్ అప్ చెప్పగానే పైకి లేచిన రవి.. ప్రత్యర్థి చేసిన దాడిని అక్కడున్న జడ్జిలు, అంపైర్‌కు చూపించాడు. దాంతో ప్రత్యర్థి చేసిన తప్పిదాన్ని గుర్తించిన జడ్జిలు.. రవి కుమార్‌ను విజేతగా ప్రకటించారు. అయితే కజకిస్థాన్ ప్లేయర్ చేసిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీని గురించి భారత మాజీ బ్యాట్స్‌మన్ వీరేంద్ర సెహ్వాగ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. 

‘ఇది ఎంత అన్యాయం, రవి దహియాను ఎదుర్కోలేక కజకిస్థాన్ ఆటగాడు రవి చేతిని కొరికాడు’ అని వీరూ భాయి ట్వీట్ చేశాడు.