విశాల్, తమన్నా జంటగా సుందర్ సి తెరకెక్కిస్తున్న చిత్రానికి తెలుగులో ‘మొగుడు’, తమిళంలో ‘పురుషన్’ అనే టైటిల్స్‌ను ఖరారు చేశారు. ఈ సందర్భంగా విడుదల చేసిన టీజర్ ఆకట్టుకుంది.
‘మొగుడిగా ఉండటం ముఖ్యం కాదు.. మొగుడు మొగుడులా ఉండటమే ముఖ్యం’ అంటూ టీవీ సీరియల్‌లో యోగిబాబు చెప్పిన డైలాగ్.. సోఫాలో తాపీగా సీరియల్ చూస్తున్న తమన్నాకు తెగ నచ్చేస్తుంది. ఆ హాలులోనే ఓ మూలన విశాల్ ఫ్లోర్ తుడుస్తుంటాడు. అదే టైమ్‌కు సెలబ్రిటీ యోగిబాబు వచ్చి సర్‌ప్రైజ్ ఎంట్రీ ఇస్తాడు.
అతనికి టీ పెట్టేందుకు కిచెన్‌లోకి వెళ్తాడు విశాల్. సీన్ కట్ చేస్తే... టీవీలో వస్తున్న యాక్షన్ సినిమా సౌండ్స్‌కు తగ్గట్టుగా కిచెన్‌లో విలన్స్‌ను చితక్కొడుతుంటాడు విశాల్. అటువైపుగా వెళ్లిన యోగిబాబు అది చూసి స్టన్ అవుతాడు. కానీ ఇంత మాస్ ఫైట్ చేస్తూ కూడా భార్యకు భయపడే మొగుడులా కవర్ చేస్తుంటాడు.
ఇలా కామెడీ, యాక్షన్‌ను మిక్స్ చేసి ప్రజెంట్ చేసిన టీజర్ ఆసక్తి రేపుతోంది. విశాల్ హీరోగా సుందర్ సి తీసిన ‘మదగజరాజా’ పన్నెండేళ్ల నిరీక్షణ తర్వాత గతేడాది సంక్రాంతికి విడుదలై సూపర్ హిట్ సాధించడంతో దీనిపై అంచనాలు పెరిగాయి. అదీకాక రజినీకాంత్, కమల్ హాసన్ ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చిన సుందర్ సి.. వెంటనే విశాల్‌తో సినిమా చేస్తుండడంతో ఆసక్తి నెలకొంది.
