ప్రాణహిత పుష్కరాలకు నిధులెందుకు ఇవ్వలేదు ..?

ప్రాణహిత పుష్కరాలకు నిధులెందుకు ఇవ్వలేదు ..?

మంచిర్యాల : ప్రాణహిత పుష్కరాలకు తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడాన్ని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి తప్పుబట్టారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి నిర్వహిస్తున్న పుష్కరాలకు నిధులు మంజూరు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కోటపల్లి మండలం అర్జునగుట్ట వద్ద ప్రాణహిత పుష్కర పుణ్య స్నానము ఆచరించిన అనంతరం వివేక్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డితో కొట్లాడి మరీ రూ.10 కోట్ల నిధులు మంజూరు చేయించిన విషయాన్ని వివేక్ గుర్తు చేశారు. ఫామ్ హౌస్ లో యజ్ఞాలు చేసి తాను పెద్ద భక్తుడినని చెప్పుకునే ముఖ్యమంత్రి.. పుష్కరాల సందర్భంగా పూజ నిర్వహించేందుకు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును ఆపి కమిషన్ల కోసం కాళేశ్వరం కట్టిండని వివేక్ ఆరోపించారు. ఈ అంశం నుంచి దృష్టి మరల్చడానికే ప్రాణహిత పుష్కరాలకు నిధులు మంజూరు చేయలేదని విమర్శించారు.

సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ గ్రాఫ్ ప్రజల్లో పడిపోతోందని వివేక్ అన్నారు. వారు ఏం మాట్లాడుతున్నారో వారికే అర్థంకాని పరిస్థితిలో ఉన్నారని చెప్పారు. వరంగల్ సభలో కేటీఆర్ ప్రధాని నరేంద్రమోడీపై చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటన్న ఆయన.. రాష్ట్రానికి కేంద్రం నిధులు మంజూరు చేయడంలేదన్న ఆరోపణల్లో ఏ మాత్రం నిజం లేదని స్పష్టం చేశారు.