
- కేంద్ర నిధులు దుర్వినియోగం చేసిండు
- ధర్నాకు వెళ్లకుండా హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు
హైదరాబాద్, వెలుగు: పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తామని హామీ ఇచ్చి.. నెరవేర్చకుండా సీఎం కేసీఆర్ మోసం చేశారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి అన్నారు. ఇండ్ల నిర్మాణానికి కేంద్రం ఇచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని ఆయన మండిపడ్డారు. డబుల్ బెడ్రూం ఇండ్ల పరిశీలనకు గురువారం కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తలపెట్టిన ‘చలో బాటసింగారం’ ప్రోగ్రామ్‌కు వెళ్లకుండా వివేక్ వెంకటస్వామిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఆయన ఫైర్ అయ్యారు.
బాటసింగారం వెళ్లకుండా బీజేపీ నేతలను హౌస్ అరెస్ట్ చేయడం బాధాకరమని, ప్రభుత్వం దౌర్జన్యానికి పాల్పడుతుందన్నారు. పీఎం ఆవాస్ యోజన స్కీమ్‌లో భాగంగా అందరికి ఇండ్లు కట్టించాలని కేంద్రం నిధులు ఇస్తున్నదన్నారు. దేశ వ్యాప్తంగా 4 కోట్ల ఇండ్లు పూర్తయ్యాని, యూపీలో 50 లక్షలు, మహారాష్ట్రలో 30లక్షలు నిర్మిస్తే తెలంగాణలో మాత్రం కట్టలేదని ఆరోపించా రు. పీఎంఆవాస్ యోజన స్కీమ్‌లో కేంద్రం ఇచ్చిన హామీ మేరకు ఇండ్లు నిర్మించి ఇస్తుందని తెలిపారు.
బీజేపీకి నష్టం చేసేలా కేసీఆర్ ప్రచారం..:విజయశాంతి
హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ చీఫ్, సీఎం కేసీఆర్ ప్రతి సందర్భంలోనూ బీజేపీకి నష్టం కలిగేలా ప్రయోగాలు, ప్రచారాలు చేస్తున్నరని బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ విజయశాంతి మండిపడ్డారు. గురువారం హౌస్ అరెస్ట్‌లో ఉన్న ఆమె ఒక పత్రిక ప్రకటన విడుదల చేశారు.
బీజేపీ ధర్నాలు, అరెస్టులు అన్ని బీజేపీ, బీఆర్ఎస్ మధ్య అవగాహనతో కూడిన డ్రామాలు అని ఇతర పార్టీలు విమ ర్శించడంపై ఆమె అసహనం వ్యక్తం చేశారు. ఈ విషయంపై కొందరు మీడియా ప్రతినిధులు కూడా తమను ప్రశ్ని స్తున్నారని.. మమ్మల్ని అడిగినట్లే కేసీఆర్‌ను కూడా అడగాలని వారికి సూచించారు.