విదేశాల్లో మన యువతకు అద్భుతమైన ఉద్యోగ అవకాశాలు ఉన్నాయన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి.హైదరాబాద్ మాదాపూర్‌లో జరిగిన కెరీర్ కన్సల్ట్ కార్యక్రమంలో వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కెరీర్ కన్సల్టెన్సీ ఆధ్వర్యంలో యువతకు అందిస్తున్న శిక్షణా తరగతులను ఆయన స్వయంగా పరిశీలించారు. నిరుద్యోగ యువతకు అంతర్జాతీయ స్థాయిలో ఉపాధి లభించేలా ఇక్కడ జపనీస్ భాషను నేర్పించడం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు. ఏకంగా 11 మంది జపాన్ లెక్చరర్స్‌తో, అద్భుతమైన ఫ్యాకల్టీ ద్వారా శిక్షణ ఇప్పించడం అభినందనీయమన్నారు.
నిరుద్యోగ యువత ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. జపనీస్ భాష నేర్చుకోవడం ద్వారా విదేశాల్లో గొప్ప అవకాశాలు అందుకోవచ్చు. కేవలం నాలుగు నెలలు కష్టపడి ఈ భాషను నేర్చుకుంటే.. లక్షల రూపాయలు సంపాదించే ఉద్యోగాలు మీ సొంతమవుతాయి. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని వదులుకోవద్దు.విదేశాలకు వెళ్లే యువతకు తెలంగాణ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు.
టామ్ కామ్' (TOMCOM) ద్వారా జర్మనీ వెళ్లే అభ్యర్థులకు ఇప్పటికే ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తోందని గుర్తుచేశారు. గ్లోబల్ మార్కెట్‌లో యువత రాణించాలన్నదే ప్రభుత్వ సంకల్పమని, ఇలాంటి శిక్షణా కార్యక్రమాలు నిరుద్యోగుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతాయని మంత్రి వివేక్ వెంకటస్వామి ఆశాభావం వ్యక్తం చేశారు.
