కొలువులే ఇవ్వనప్పుడు రిజర్వేషన్లు ఇచ్చి ఏం లాభం

కొలువులే ఇవ్వనప్పుడు రిజర్వేషన్లు ఇచ్చి ఏం లాభం

సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రం అప్పులపాలైందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి విమర్శించారు. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలో 5వ రోజు ప్రజా గోస బీజేపీ భరోసా కార్యక్రమం ప్రారంభించారు. రాష్ట్ర గిరిజన మోర్చ అధ్యక్షుడు జాటోత్ హుస్సేన్ నాయక్, జిల్లా అధ్యక్షుడు రామచంద్రరావు ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. తరువాత వావిలాల గ్రామంలో  వివేక్  బీజేపీ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన వివేక్ వెంకటస్వామి.. కాళేశ్వరం ప్రాజెక్టుతో చుక్క నీరు ఇవ్వకపోగా.. వేల కోట్లు స్వాహా చేశారని విమర్శించారు. కొలువులే ఇవ్వనప్పుడు రిజర్వేషన్లు ఇచ్చి ఏం లాభం అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ హయాంలో తెలంగాణ అప్పులమయంగా మారిందన్నారు. 60 వేల కోట్ల అప్పుతో  వచ్చిన రాష్ట్రం.. ఇప్పుడు 5 లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిందన్నారు. ప్రజలకు ఉద్యోగాలు, డబుల్ బెడ్ రూమ్ ఇవ్వలేదు గానీ.. కేసీఆర్ కొడుకు, కూతురు  100 ఎకరాల్లో ఫామ్ హౌజ్ లు కట్టుకున్నారని ఆరోపించారు.

అత్యంత అవినీతిపరుడు కేసీఆర్ అని వివేక్ వెంకటస్వామి  అన్నారు. ప్రజాధనాన్ని దోచుకుంటున్న కల్వకుంట్ల కమిషన్ రావు ..కాళేశ్వరం పేరుతో వేల కోట్లు స్వాహా చేశారని ఆరోపించారు. రాష్ట్రం బంగారు తెలంగాణ కాలేదు కానీ కల్వకుంట్ల కుటుంబం బంగారం అయిందన్నారు.   ఒక్కో ఓటుకు  రూ.5 వేలు ఇచ్చి కేసీఆర్  మళ్ళీ అధికారంలోకి రావాలని  చూస్తున్నాడని అన్నారు. హుజూరాబాద్ లో కేసీఆర్ గోస వద్దని కారును పంచర్ చేశారని  ఎద్దేవా చేశారు. కేసీఆర్ ను  ఇంటికి పంపిస్తేనే రాష్ట్ర ప్రజల గోస పోతుందన్నారు.  మునుగోడులో గిరిజనుల ఓట్ల కోసమే కేసీఆర్ గిరిజన బంధు  అంటుండన్నారు.  సీఎం కేసీఆర్  ప్రజలను ఎన్నిరకాలుగా మభ్య పెట్టినా ఆయనను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని..మునుగోడులో బీజేపీ గెలుపు ఖాయమన్నారు.  మునుగోడులో ఒడిపోతాననే భయంతోనే పదేపదే కేసీఆర్ జాతీయ రాజకీయాలు అంటుండన్నారు.  తెలంగాణను అభివృద్ధిలో కాకుండా అవినీతిలో అగ్రగామిగా నిలిపిన ఘనత కేసీఆర్ దేనని వివేక్ అన్నారు.