రైళ్ల హాల్టింగును పున: ప్రారంభించిన వివేక్ వెంకటస్వామి

రైళ్ల హాల్టింగును పున: ప్రారంభించిన వివేక్ వెంకటస్వామి

పెద్దపల్లి, వెలుగు: పేదలకు ప్రయాణాలు అందుబాటులోకి తీసుకురావాలంటే మరిన్ని రైళ్లు పునరుద్దరించుకోవాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపీ డాక్టర్ వివేక్ వెంకటస్వామి అన్నారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని రైల్వేస్టేషన్లో బుధవారం రామగిరి ఎక్స్ప్రెస్, అజ్నీ ఎక్స్ప్రెస్లను పున:ప్రారంభించారు. ఈ సందర్బంగా ఓదెలకు చేరుకున్న వివేక్ ను గ్రామస్తులు, అభిమానులు పూలు చల్లుతూ డప్పు చప్పుళ్లతో రైల్వేస్టేషన్ కు  తీసుకుపోయారు. అనంతరం స్టేషన్ కు  చేరుకున్న రైళ్లను వివేక్ కొబ్బరికాయ కొట్టి పున:ప్రారంభించారు. ఈ సందర్బంగా వివేక్ ప్రయాణికులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రయాణ ఖర్చులు పెరిగిపోయిన క్రమంలో పేద ప్రజల ఊర్ల ప్రయాణాలు చేయాలంటే ఆలోచిస్తున్నారన్నారు. స్థానిక ప్రజలు ఓదెల రైల్వే స్టేషన్లో రామగిరి, అజ్నీ రైళ్లను ఆపేలా కృషిచేయాలని తనను కోరారని వివేక్ తెలిపారు. ప్రజల కోరిక మేరకు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ను  కలిసి పరిస్థితి వివరించానన్నారు. సమస్య తీవ్రతను గుర్తించిన రైల్వే మంత్రి రెండు రైళ్లు ఆపడానికి అంగీకరించి ఆదేశాలిచ్చాడన్నారు. ఈ సందర్బంగా కేంద్ర మంత్రికి వివేక్ కృతజ్ఞతలు తెలిపారు.

అనంతరం కాల్వ శ్రీరాంపూర్ మండలం గంగారం గ్రామానికి చెందిన గుడ్ల నరేష్, పవిత్రలకు ఇటీవలే వివాహం జరిగింది, నూతన దంపతులను వివేక్ ఆశీర్వదించారు. అలాగే గంగారం గ్రామ సర్పంచ్ కొంకటి మల్లారెడ్డి తండ్రి కొంకటి రాజిరెడ్డి ఇటీవల మృతి చెందాడు. ఈ క్రమంలో వివేక్ వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపారు. వేర్వేరుగా జరిగిన కార్యక్రమాల్లో బీజేపీ నాయకులు గొట్టి ముక్కుల సురేష్ రెడ్డి, సయ్యద్ సజ్జాద్, అల్లం సతీష్, బాలసాని సతీష్, అడ్డగుంట రాజెందర్, ఏగోళపు సదయ్యగౌడ్, ఆరెపల్లి రాకేష్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.