మోదీ నాయకత్వంలో అగ్రగామిగా భారత్: వివేక్ వెంకటస్వామి

మోదీ నాయకత్వంలో అగ్రగామిగా భారత్: వివేక్ వెంకటస్వామి

ప్రధాని మోదీ నాయకత్వంలో ప్రపంచ దేశాలు భారత్​వైపు  ఆసక్తి గా చూస్తున్నాయని మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా బాగ్​ లింగంపల్లిలోని అంబేడ్కర్​ విద్యాసంస్థల్లో ఆయన జాతీయ జెండా ఆవిష్కరించారు.. కాకా విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. 

అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. మోదీ నాయకత్వంలో దేశం అగ్రగామిగా నిలుస్తోందని అన్నారు. ప్రపంచంలోని 5 వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్​నిలిచిందని త్వరలో 3వ స్థానంలోకి చేరుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు. 

దేశ జీడీపీ గణనీయంగా వృద్ధి సాధించిందని అన్నారు. చదువు ప్రాధాన్యతను విద్యార్థులకు వివరించారు.  పేద పిల్లలకు క్వాలిటీ ఎడ్యుకేషన్​ అందించడానికి కాకా పరితపించారని గుర్తు చేశారు. తమ విద్యాసంస్థల విద్యార్థులు సాధించిన విజయాల్ని గుర్తు చేసుకున్నారు. 

అందులో పని చేస్తున్న డైరెక్టర్లు, ఫ్యాకల్టీతోనే ఇది సాధ్యపడిందని అన్నారు. ఈ సందర్భంగా అక్టోబర్​, నవంబర్​నెలల్లో నిర్వహించే ఇంటర్నేషనల్​ సెమినార్​ పోస్టర్​ని  కరస్పాండెంట్​సరోజ వివేక్, వంశీ కృష్ణ, వెంకట్, అకాడమిక్​ డైరెక్టర్ రిషి కుమార్​ తదితరులతో కలిసి ఆయన ఆవిష్కరించారు.  విద్యార్థులు చేసిన ఎన్​సీసీ పరేడ్​ ఎంతగానో ఆకట్టుకుంది. 

త్యాగాల ఫలితమే స్వాతంత్య్రం..

ఎందరో మహనీయుల ప్రాణ త్యాగాల ఫలితమే భారత స్వాతంత్య్రం అని విశాఖ ఇండస్ట్రీస్ జే ఎం డీ వంశీకృష్ణ అన్నారు. మహనీయుల అడుగు జాడల్లో నడిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని విద్యార్థులకు సూచించారు. తన తాతయ్య కాక స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.