తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో త్రిముఖ పోటీ.. ప్రజలు అలోచించి ఓటు వేయండి: సీఎం రేవంత్

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో త్రిముఖ పోటీ.. ప్రజలు అలోచించి ఓటు వేయండి: సీఎం రేవంత్

తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న క్రమంలో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. ఎన్నికల ప్రచారానికి సోమవారం ( ఫిబ్రవరి 9) సాయంత్రంతో శుభం కార్డు పడనుంది.  ఈ క్రమంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రజలకు కీలక సందేశం ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య త్రిముఖ పోటీ నెలకొందని.. ప్రజలు అలోచించి ఓటేయాలని కోరారు సీఎం రేవంత్ రెడ్డి. గత ప్రభుత్వ పాలనను, తమ ప్రభుత్వ రెండేళ్ల పాలనను బేరీజు వేసుకొని ఓటేయాలని అన్నారు సీఎం రేవంత్.

కేంద్రంలో గత 11ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో గత పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీలు రాష్ట్ర ప్రజలు చేసిందేమీ లేదని అన్నారు. హైదరాబాద్ కు వరద నష్టాన్ని ఇప్పటికీ కేంద్రం ఇవ్వలేదని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో గెలిస్తే కేంద్రం నిధులు తెస్తామని బండి సంజయ్ అంటున్నారని.. 8 మంది ఎంపీలు ఉండి రాష్ట్రానికి ఏం తెచ్చారో ముందు చెప్పాలని.. గెలిస్తే కేంద్రం నిధులు తెస్తామని చెప్తే ప్రజలు నమ్ముతారా అని ప్రశ్నించారు సీఎం రేవంత్.

►ALSO READ | బీజేపీకి రాహుల్ భయం.. కాంగ్రెస్ ఎంపీల ఆందోళనలో ఎంపీ వంశీకృష్ణ

దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రం నిధుల్లో వివక్ష ఉందని.. దక్షిణాదికి రావాల్సిన నిధులు రావట్లేదని లెక్కలున్నాయని అన్నారు. కేంద్ర మంత్రులు వచ్చి రాష్ట్రానికి లక్ష కోట్లు ఇచ్చామని అంటున్నారని.. మనం రూపాయి చెల్లిస్తే కేంద్రం కేవలం 42 పైసలు మాత్రమే ఇస్తుందని అన్నారు. అదే బీహార్ రూపాయి చెల్లిస్తే.. కేంద్రం 6 రూపాయలు ఇస్తుందని అన్నారు. దక్షిణాదిపై కేంద్రం వివక్షను కిషన్ రెడ్డి, బండి సంజయ్ ప్రశ్నించరా అని అన్నారు సీఎం రేవంత్.