కేసీఆర్​ను ఓడించేందుకు ఇదే కరెక్ట్ టైమ్: వివేక్ వెంకటస్వామి

కేసీఆర్​ను ఓడించేందుకు ఇదే కరెక్ట్ టైమ్: వివేక్ వెంకటస్వామి
  •     నన్ను, ఓదెలును కేసీఆర్ రోడ్డున పడేసిండు
  •     ఇప్పుడు ఇద్దరం కలిసి కేసీఆర్ ను రోడ్డున పడేస్తం
  •     ప్రజల కోరిక మేరకే అసెంబ్లీకి పోటీ చేస్తున్నట్టు వెల్లడి
  •     నిరంకుశ బాల్క సుమన్​ను ఓడించడమే మా లక్ష్యం: ఓదెలు

కోల్​బెల్ట్, వెలుగు: సీఎం కేసీఆర్ ను ఓడించేందుకు ఇదే కరెక్టు టైమ్ అని పెద్దపల్లి మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత వివేక్ వెంకటస్వామి అన్నారు. అవినీతి, నియంతృత్వ బీఆర్ఎస్ ను తరిమికొడదామని ప్రజలకు పిలుపునిచ్చారు. శనివారం మంచిర్యాల జిల్లా మందమర్రిలో మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, జడ్పీ చైర్​పర్సన్​నల్లాల భాగ్యలక్ష్మి దంపతుల ఇంట్లో కాంగ్రెస్ చెన్నూరు నియోజకవర్గ స్థాయి మీటింగ్ నిర్వహించారు. దీనికి కుమారుడు వంశీకృష్ణతో కలిసి వివేక్ ముఖ్య​అతిథిగా హాజరై మాట్లాడారు. 

నాయకులను నమ్మించి గొంతు కోయడం కేసీఆర్ కు కొత్తేమీ కాదని ఆయన మండిపడ్డారు. ‘‘గతంలో నాకు టికెట్ ఇస్తానని కేసీఆర్ మోసం చేసిండు. నాయకులను మోసం చేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. నన్ను, ఓదెలును కేసీఆర్ రోడ్డు మీద పడేసిండు. ఇప్పుడు ఇద్దరం కలిసి కేసీఆర్​ను రోడ్డున పడేస్తాం” అని అన్నారు. ‘‘ప్రజల కోరిక మేరకే అసెంబ్లీకి పోటీ చేస్తున్న. పెద్దపల్లి లోక్ సభ, చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గాల ప్రజలు మా కుటుంబానికి ఎప్పుడూ అండగా ఉంటున్నారు. 

అసెంబ్లీ బరిలో ఉంటే గెలిపిస్తామని అభయం ఇచ్చారు. వాళ్లకు జీవితాంతం రుణపడి ఉంటాను. ఎమ్మెల్యే బాల్క సుమన్​ నియంతృత్వ పాలనను అంతం చేసేందుకు అసెంబ్లీ బరిలో నిలవాలని నిర్ణయం తీసుకున్నాను” అని చెప్పారు. నల్లాల ఓదెలు, భాగ్యలక్ష్మి, పార్టీ శ్రేణులు, ప్రజల సమష్టి కృషితో కాంగ్రెస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 

కమీషన్ల కోసమే కేసీఆర్ కాళేశ్వరం కట్టిండు.. 

కమీషన్ల కోసమే కేసీఆర్  కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారని వివేక్ ఆరోపించారు. ‘‘రాజశేఖర్ రెడ్డితో కొట్లాడి నా తండ్రి కాకా వెంకటస్వామి గ్రావిటీ ప్రాజెక్టు అయిన ప్రాణహిత–చేవెళ్ల తీసుకొచ్చారు. కానీ కమీషన్ల కోసం ప్రాజెక్టును కేసీఆర్ మార్చారు. ఈ పదేండ్లలో కేసీఆర్ అవినీతి, నియంతృత్వ పాలన సాగించారు. ఆయనను ఓడించేందుకు జనం సిద్ధంగా ఉన్నారు. 

ఇప్పుడు మొదలైన పోరాటం.. కేసీఆర్​ను గద్దె దించేంత వరకు కొనసాగించాలి. కేసీఆర్ డబ్బులు ఇస్తే తీసుకోండి. కానీ ఓటు మాత్రం కాంగ్రెస్ కు వేసి, కేసీఆర్ కు తగిన బుద్ధి చెప్పండి” అని ప్రజలకు పిలుపునిచ్చారు. ‘‘భారత్​ జోడో యాత్రలో ఘర్​వాపసీకి రాహుల్ పిలుపునిచ్చారు. అవినీతి, నియంతృత్వ బీఆర్ఎస్ ను గద్దె దించేందుకు అందరూ కలిసిరావాలని చెప్పారు. 

అందుకే కాంగ్రెస్ లో చేరాను” అని తెలిపారు. కాగా, అంతకుముందు మందమర్రికి చేరుకున్న వివేక్ వెంకటస్వామికి కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. నల్లాల ఓదెలు ఇంటి వరకు ర్యాలీ నిర్వహించారు. సమావేశంలో లీడర్లు​ దుర్గం నరేశ్, అబ్దుల్​అజీజ్, క్రాంతి తదితరులు పాల్గొన్నారు. 

బాల్క సుమన్​ను ఓడించడమే మా లక్ష్యం: ఓదెలు 

చెన్నూరులో నిరంకుశ ఎమ్మెల్యే బాల్క సుమన్​ను ఓడించడమే తమ లక్ష్యమని మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు అన్నారు. చెన్నూరు నుంచి బాల్క సుమన్ ను తరిమికొట్టడం వివేక్ వెంకటస్వామితోనే సాధ్యమవుతుందని చెప్పారు. చెన్నూరు ఎమ్మెల్యేగా వివేక్ గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ‘‘నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు బాల్క సుమన్ లో వణుకు చూసిన. 

ఇప్పుడు మళ్లీ వివేక్ అన్న రాకతో బాల్క సుమన్ లో భయం చూస్తున్న. వంద హామీలు ఇచ్చి నెరవేర్చనోడు ఎమ్మెల్యేగా ఉండడానికి అర్హత లేదు. సుమన్ గెలిస్తే మన నెత్తి మీద ఉంటడు. అదే వివేక్ వెంకటస్వామి గెలిస్తే మన మనసులో ఉంటడు. చెన్నూరులో సుమన్, అక్కడ కేసీఆర్ ఓడిపోయి కాంగ్రెస్​ రావాలి” అని అన్నారు.