కరోనాను సీఎం అస్సలు పట్టించుకోవట్లే…

కరోనాను సీఎం అస్సలు పట్టించుకోవట్లే…

హైదరాబాద్, వెలుగురాష్ట్రంలో సీఎం కేసీఆర్​ నయా నిజాంలా పాలన సాగిస్తున్నారని మాజీ ఎంపీ, బీజేపీ కోర్​కమిటీ సభ్యుడు వివేక్​ వెంకటస్వామి ఆరోపించారు. రాష్ట్రంలో అసలు ప్రతిపక్షాలు ఉన్నట్లుగానే కేసీఆర్ గుర్తించడం లేదని, ప్రజా సమస్యలపై పోరాడుతున్న ప్రతిపక్ష నేతలపై దాడులు చేయిస్తున్నారని మండిపడ్డారు. కరోనాను కంట్రోల్​ చేసేందుకు ప్రధాని మోడీ అన్ని పార్టీల నేతలతో సమావేశమై సలహాలు, సూచనలు తీసుకున్నారని, అన్ని రాష్ట్రాల సీఎంలతో చర్చించి వాళ్ల అభిప్రాయాలు తీసుకుని నిర్ణయాలు అమలు చేశారని చెప్పారు. కానీ రాష్ట్రంలో అలాంటి పరిస్థితి లేదని, హాస్పిటల్స్​లో బెడ్లు, వెంటిలేటర్లు, కరోనా పేషెంట్ల పరిస్థితిపై సీఎం కేసీఆర్​ ఒక్క సమీక్ష కూడా నిర్వహించలేదని ఆరోపించారు. ప్రతిపక్షాలు సలహాలు ఇస్తే బాగుంటుందన్న మంత్రి కేటీఆర్ కామెంట్లపై వివేక్​ పైవిధంగా స్పందించారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రెస్​నోట్​ రిలీజ్​ చేశారు.

ప్రజల ఇబ్బందులు పట్టించుకుంటలేరు

‘‘కరోనా నియంత్రణకు ప్రధాని మోడీ అన్ని పార్టీల నేతలతో సమావేశమై సలహాలు, సూచనలు తీసుకున్నారు. అన్ని రాష్ట్రాల సీఎంలతో పలుసార్లు వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే పలు నిర్ణయాలు తీసుకుని వాటిని అమలు చేశారు. అన్ని రాష్ట్రాలకు పీపీఈ కిట్లు, మాస్క్ లు, వెంటిలేటర్లను కేంద్ర ప్రభుత్వం పంపింది. లాక్ డౌన్ వల్ల ఇబ్బంది పడుతున్న అన్ని వర్గాలను ఆదుకునేందుకు రూ.21 లక్షల కోట్లతో ఆత్మనిర్భర్ భారత్ పేరుతో ప్రత్యేక ప్యాకేజ్ ను ప్రకటించింది. కానీ రాష్ట్రంలో అలాంటి పరిస్థితి లేదు. నయా నిజాం తరహాలో కేసీఆర్ పాలన సాగిస్తున్నారు. ఉద్యమంలో అందరం కొట్లాడినం, ఉమ్మడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడినం. ఇప్పుడు మన ప్రభుత్వానికి సరిగ్గా పాలన చేయాలనే చిత్తశుద్ధి లేదు. సెక్రటేరియట్ కూల్చివేత సమయంలో ప్రభుత్వ హాస్పిటళ్లలో చాలా బెడ్స్ ఖాళీగా ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అలాగైతే గాంధీ హాస్పిటల్ లో పేషెంట్లను ఎందుకు చేర్చుకోవటం లేదు. ప్రైవేట్ హాస్పిటల్స్​ కు వెళదామన్నా అక్కడ కూడా బెడ్స్, వెంటిలేటర్స్ ఫుల్ అయ్యాయని చెబుతున్నారు. కరోనా విషయంలో ఎన్నో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ప్రభుత్వం సహకరించటం లేదు. ఎన్ని బెడ్లు ఉన్నాయి?, ఎన్ని వెంటిలేటర్లు ఉన్నాయి?, పేషెంట్లను సరిగా అడ్మిట్ చేసుకుంటున్నారా లేదా? అన్న విషయాలపై ఒక్కసారి కూడా కేసీఆర్​ సమీక్ష చేయలేదు. ఢిల్లీలో సెంట్రల్ హెల్ప్ లైన్ నంబర్ ఏర్పాటు చేశారు. ఫోన్ చేస్తే అధికారులే గైడ్ చేస్తారు. కానీ రాష్ట్రంలో ఒక్క సెంట్రల్ హెల్ప్ లైన్ నంబర్ కూడా లేదు. కరోనా గురించి మర్చిపోయిన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఫాంహౌస్ లో కూర్చొని ప్రాజెక్టుల కమీషన్ల గురించే ఆలోచిస్తున్నారు’’అని వివేక్ ఆరోపించారు.

ఆందోళనలు,నిరసనలతో అట్టుడికిన ఓరుగల్లు