- గత బీఆర్‌ఎస్ పాలనలో ఇక్కడ ఎలాంటి అభివృద్ధి జరగలేదు: మంత్రి వివేక్ వెంకటస్వామి
- డెవలప్‌మెంట్ చేయకపోవడంతోనే బాల్క సుమన్‌ను ప్రజలు ఓడించారు
- మంచిర్యాల జిల్లా చెన్నూరు, క్యాతనపల్లి, జైపూర్, భీమారంలో మంత్రి పర్యటన
- అంగన్‌వాడీ టీచర్లకు సెల్ ఫోన్లు, లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ
కోల్‌బెల్ట్/చెన్నూరు, వెలుగు: చెన్నూరు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఎలాంటి అభివృద్ధి చేయలేదన్న కారణంతోనే ప్రజలు అతన్ని ఓడించి గుణపాఠం చెప్పారని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. తాను తెచ్చిన నిధులనే ఇప్పుడు ఖర్చు చేస్తున్నారంటున్న సుమన్.. అప్పుడే ఎందుకు అభివృద్ధి చేయలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. మంగళవారం మంచిర్యాల జిల్లా చెన్నూరు, క్యాతనపల్లి, జైపూర్, భీమారంలో మంత్రి పర్యటించారు. చెన్నూరులోని వార్డుల్లో మార్నింగ్ వాక్ చేసిన మంత్రి.. స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
వారి సమస్యలు వెంటనే పరిష్కరించాలని అక్కడికక్కడే ఆఫీసర్లను ఆదేశించారు. ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్‌లో అంగన్‌వాడీ టీచర్లకు సెల్ ఫోన్లను, లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సోషల్ మీడియాను అడ్డుపెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వంపై బాల్క సుమన్ అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. నిధులుంటే కాళేశ్వరం ప్రాజెక్టు కోసం సేకరించిన భూములకు సంబంధించి రూ.33 కోట్ల పరిహారాన్ని రైతులకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.
బ్యాక్ వాటర్‌తో నష్టపోయిన రైతులను కూడా పట్టించుకోలేదని మండిపడ్డారు. బీఆర్‌ఎస్ పాలనలో నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఆరోపించారు. తాను చెన్నూరు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాతే అనేక పనులు చేపట్టి.. అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భూములు కోల్పోయిన వారికి, బ్యాక్‌వాటర్‌తో నష్టపోయిన రైతులకు పరిహారం ఇప్పించినట్లు గుర్తుచేశారు.
కాంగ్రెస్ పాలనపై అన్ని వర్గాల్లో సంతృప్తి..
కాంగ్రెస్ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని, అన్ని వర్గాల అభ్యున్నతి, సంక్షేమం కోసం కృషి చేస్తున్నామని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. ప్రజలను ఆదుకోవడానికి ఆరు గ్యారంటీలను ప్రభుత్వం అమలు చేస్తోందని చెప్పారు. అర్హులకు ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తున్నామన్నారు. గత పదేండ్ల బీఆర్‌ఎస్ హయాంలో ఒక్క రేషన్ కార్డు, డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసిందని తెలిపారు.
ఇక్కడ యువతకు ఉపాధి కల్పించడానికి జర్మనీ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నామని తెలిపారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ.లక్ష కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ప్రజల సొమ్మును వృథా చేసిందని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు కూలేశ్వరంగా మారిందన్నారు. కాళేశ్వరం అవినీతిపై సీబీఐ ఎంక్వైరీ కోరినా కేంద్రం పట్టించుకోవడం లేదన్నారు. ఈ వ్యవహారంలోబీజేపీ, బీఆర్ఎస్ మధ్య అవగాహన ఉన్నట్టు అర్థమైందన్నారు. మిషన్ భగీరథ ఒక ఫెల్యూర్ ప్రాజెక్టు అని అన్నారు.
బొగ్గు, నీళ్లు సులభంగా లభించే మంచిర్యాల ప్రాంతంలో కాదని కమీషన్ల కోసం కేసీఆర్ యాద్రాద్రి వద్ద పవర్ ప్లాంట్ ఏర్పాటు చేశారని ఆరోపించారు. జీవన్‌రెడ్డికి కాంగ్రెస్ అపార గౌరవం ఇచ్చిందని, ఆయన తొందరపాటు నిర్ణయం తీసుకున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సెల్ ఫోన్లను అంగన్‌వాడీ టీచర్లు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మంత్రి వెంట చెన్నూరు మున్సిపల్ వైస్ చైర్మన్ నాయకపు వినయ్ కుమార్, ఐసీడీఎస్ బాధ్యురాలు మనోహరమ్మ, డీసీసీ ప్రెసిడెంట్ పిన్నింటి రఘునాథ్ రెడ్డి, బండి సదానందం యాదవ్, పల్లె రాజు, ఒడ్నాల శ్రీనివాస్, నర్సింగ్, కౌన్సిలర్లు ఉన్నారు.

