వివేకానంద బోధనలు యువత పాటించాలి

వివేకానంద బోధనలు యువత పాటించాలి

హైదరాబాద్: జీవితంలో సమస్యలను పూర్తి ధైర్యంతో ఎదుర్కోవడానికి, విజయం సాధించడానికి వివేకానంద బోధనలు అత్యంత ఉపయుక్తమైనవన్నారు గవర్నర్ తమిళిసై. స్వామి వివేకానందుని చారిత్రాత్మక చికాగో ఉపన్యాసం 127వ వార్షికోత్సవం సందర్భంగా రామకృష్ణ మఠం, వివేకానంద ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్స్ లెన్స్ సంస్థలు సంయుక్తంగా సంప్రీతి దినోత్సవం నిర్వహించాయి. ఈ సమావేశంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గవర్నర్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సంధర్భంగా తమిళిసై మాట్లాడుతూ.. తాను ఎప్పుడైనా నిరాశకు గురైతే, తాను స్వామి వివేకానందుని రచనలు చదివి పునరుత్తేజితమౌతానని తెలిపారు. సమస్తమైన శక్తి మనలోనే దాగుందని, సంకల్ప శక్తితో యువత అనుకున్నది సాధించవచ్చని, స్వామి వివేకానంద చాటి చెప్పాడని, ఇవి అత్యంత స్ఫూర్తివంతమైన మాటలని తెలిపారు గవర్నర్. తనకు 4వ తరగతిలో ఉన్నప్పుడు, తన నాన్న వివేకానందుని పుస్తకం బహుకరించాడని, అప్పటి నుండి తాను వివేకానందుని మాటలు, రచనల ద్వారా నిరంతరం స్ఫూర్తి పొందుతున్నానని చెప్పారు.

చికాగో 127 సంవత్సరాల క్రితం వివేకానందుడు భారతీయ వేదాంత చింతన గూర్చి ఒక సింహం వలె గర్జించాడని, ఆయన మాటలు ఇప్పటికీ అనుసరణనీయమని అన్నారు. ప్రపంచ పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్స్ లో స్వామి చేసిన ప్రసంగాలలో అతి ముఖ్యమైన అంశాలు మూఢత్వాన్ని, ద్వేషాన్ని వదలాలని చెప్పడం. ప్రపంచంలో శాంతి, సౌభ్రాతృత్వం, అభివృద్ధి కోసం వివిధ మతాలు ఒకదానినొకటి గౌరవించడం అత్యంత ఆవశ్యకమైనవన్నాడని తెలిపారు తమిళిసై. రామకృష్ణ మఠం, అలాగే 21వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న వివేకానంద ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ లు భారతీయ విశిష్ఠ సంస్కృతి, వేదాంత భావనను, వివేకానందుని బోధనలు విశ్వవ్యాప్తం చేయడంలో గొప్పగా పనిచేస్తున్నాయని గవర్నర్ అభినందించారు. విద్యార్థులు, యువత స్వామి వివేకానందుని బోధనలను ఆదర్శంగా తీసుకుని, స్ఫూర్తితో కృషి చేసి తమ శక్తి సామర్థ్యాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. విద్యార్ధులు, యువతలో ఆత్మహత్య సంఘటనలు పెరుగుతుండటం పట్ల గవర్నర్ ఆందోళన వ్యక్తం చేశారు. బలమే జీవనం.. బలహీనతే మరణం లాంటి ఎన్నో సూక్తులను యువత పాటించి జీవతంలో సక్సెస్ కావాలని ఆమె యువతకు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో రామకృష్ణ మఠం వైస్ ప్రెసిడెంట్ స్వామి గౌతమానంద, ఆర్కే మఠం అధ్యక్షులు స్వామి జ్ఞానదానంద, వివేకానంద ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ సంస్థ డైరెక్టర్ స్వామి బోధమయానంద, రాకా సుధాకర్, అజిత్ సింగ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.