తెలంగాణలో 3కోట్లు దాటిన ఓటర్లు

తెలంగాణలో 3కోట్లు దాటిన ఓటర్లు
  • పెండింగ్ లో ఉన్న దరఖాస్తులకు లైన్ క్లియర్
  • 13, 14 తేదీల్లో కలెక్టర్లతో సీఈవో సమావేశం
  • 90 నియోజకవర్గాల్లో ఈవీఎంల డేటా డిలీట్

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: రాష్ట్రంలో ఓటర్లు 3 కోట్లు దాటారు. ఫిబ్రవరి 4 నాటికి కొత్తగా చేరిన ఓటర్లతో ఈ సంఖ్య 2,93,10,130 మంది అని ఎన్నికల సంఘం ప్రాథమికంగా నిర్ధారించింది. కొన్ని కారణాలతో 10,34,357 దరఖాస్తులను పెండింగ్ లో పెట్టింది. తాజాగా వాటిని కూడా క్లియర్​ చేసిన సీఈవో వర్గాలు.. ఓటర్ల సంఖ్య 3 కోట్లు దాటిందని వెల్లడించాయి. ఓటర్ల జాబితాపై పలు ఆరోపణలు వస్తుండటంతో ఈసారి ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా సాంకేతిక పరిజ్ఞానంతో ఓటరు నమోదు ప్రక్రియను చేపట్టినట్టు తెలిపాయి.

13,14 తేదీల్లో కలెక్టర్ల సదస్సు

ఓటర్ల నమోదుతో పాటు లోక్‌ సభ ఎన్నికల ఏర్పాట్లపై ఈనెల 13, 14 తేదీల్లో జిల్లా ఎన్నికల అధికారులతో (కలెక్టర్లు ) సీఈవో రజత్ కుమార్​ సమావేశాలు నిర్వహించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో చేసిన ఏర్పాట్లకు అదనంగా కావాల్సిన సౌకర్యాలపై ఆ సమావేశాల్లో చర్చించనున్నారు. రాష్ట్రంలో కొత్తగా ములుగు, నారాయణపేట జిల్లాల ఏర్పాటుపైనా చర్చించే అవకాశాలున్నాయి. జిల్లాల ఏర్పాటును ప్రభుత్వం అధికారికంగా ప్రకటిస్తే తప్ప 31 జిల్లాల ప్రాతిపదికనే ఎన్నికల నిర్వహించాలని సీఈవో భావిస్తున్నారు. ఒకవేళ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్​ తీసుకొస్తే, దానిని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లాలని భావిస్తున్నారు. ఆ తర్వాత ఆయా జిల్లాలకు నియమించే కొత్త కలెక్టర్లతో ప్రత్యేకంగా చర్చించి ఎన్నికల ఏర్పాట్లు చేయాలని యోచిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో వాడిన ఈవీఎంలలో పోలింగ్ సమాచారాన్ని కలెక్టర్లు తీసేశారు. హైకోర్టులో ఎన్నికల పిటిషన్లు ఉన్న 29 నియోజకవర్గాలను మాత్రం మినహాయించారు. స్థానిక రాజకీయ పార్టీల ప్రతినిధులతో మొదటి దశ తనిఖీ తర్వాత డేటా డిలీట్ చేసిన ఈవీఎంలను స్ట్రాంగ్ రూంలో భద్రపరుస్తారు. కాగా , లోక్​సభ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లకు సంబంధించి గురువారం ఢిల్లీలో అన్ని రాష్ట్రాల సీఈవోలతో కేంద్ర ఎన్నికల సంఘం సమావేశం నిర్వహించింది. ఇన్ఫర్మేషన్​ టెక్నాలజీ వ్యవస్థల వాడకంపై సమావేశంలో అవగాహన కల్పించారు. ఎన్నికల టైంలో సోషల్ మీడియా ప్రచారాల నియంత్రణపై చర్చించినట్టు తెలుస్తోంది.