బెంగళూరులోని స్కూళ్లకు వరుసగా బాంబు బెదిరింపు ఇమెయిల్స్ పంపిన కేసులో పోలీసులు ఓ మహిళను అదుపులోకి తీసుకున్నారు. ఈమె పేరు రెనే జోషిల్డా. అలాగే దేశవ్యాప్తంగా చాలా నకిలీ బాంబు బెదిరింపు కేసులకు ఈమే కారణమని పోలీసులు గుర్తించారు. రెనే జోషిల్డాను మొదట అహ్మదాబాద్‌లో వేరే కేసులో అరెస్టు చేశారు. అయితే బెంగళూరు పోలీసులు ఆమెను 'బాడీ వారెంట్' ద్వారా ఇక్కడికి తీసుకొచ్చారు.
డీసీపీ నార్త్ బాబాసాబ్ నెమగౌడ్ మాట్లాడుతూ ఆమె మొదట అహ్మదాబాద్ కేసులో పట్టుబడింది. కానీ దర్యాప్తులో ఆమె బెంగళూరులోని చాలా స్కూళ్లకు కూడా బెదిరింపు ఇమెయిల్‌లు పంపినట్లు తెలిసింది. అందుకే ఆమెను బెంగళూరుకి తీసుకొచ్చి మరింత లోతుగా విచారణ చేస్తున్నాం అని చెప్పారు. గుజరాత్‌తో పాటు మైసూరు, చెన్నైలలో కూడా ఆమెపై ఇలాంటి బెదిరింపు కేసులు నమోదయ్యాయి.
పోలీసుల దర్యాప్తులో జోషిల్డా పోలీసులకు దొరక్కకుండా ఉండేందుకు టెక్నాలజీని వాడినట్లు కూడా తెలిసింది. ఇందుకు ఇంటర్నెట్‌లో ఆమె ఉండే లొకేషన్, గుర్తింపు దాచిపెట్టడానికి VPN సర్వీస్ ఉపయోగించింది. అలాగే 'GetCood' అనే యాప్ ద్వారా నకిలీ మొబైల్ నంబర్లను కొనుగోలు చేసింది. ఇంకా ఆమె ఒకేసారి ఆరు నుంచి ఏడు వాట్సాప్ అకౌంట్స్ నడిపింది. ఈ నకిలీ నంబర్లు, ఇమెయిల్ ఐడీల ద్వారా బెదిరింపు మెసేజులు పంపిందని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఇతర రాష్ట్రాల పోలీసుల ప్రకారం, ఈ బెదిరింపులకు వ్యక్తిగత కక్ష కారణమని తెలుస్తోంది. జోషిల్డా మాజీ సహోద్యోగి తన ప్రేమను అంగీకరించక, వేరే పెళ్లి చేసుకోవడంపై కోపంతో పగ పెంచుకుంది. ఇందుకు బాంబు బెదిరింపు కేసుల్లో అతన్ని ఇరికించడానికి అతని వివరాలు, ఆన్‌లైన్ ఐడీలను వాడినట్లు ఆమెపై ఆరోపణలు ఉన్నాయి.
జోషిల్డా తమిళనాడుకు చెందిన 30 ఏళ్ల మహిళ. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో బీఈ పూర్తి చేసిన ఆమె గతంలో బెంగళూరులోని ఒక టెక్ కంపెనీలో పనిచేసి, ఆ తర్వాత సిటీ విడిచి వెళ్లిపోయింది. ప్రస్తుతం బెంగళూరు పోలీసులు ఇతర రాష్ట్రాల సైబర్ పోలీసులతో కలిసి ఆమె పై ఇంకా లోతుగా విచారిస్తున్నారు.
