ఎయిర్ ఇండియాలో వీఆర్ఎస్

ఎయిర్ ఇండియాలో వీఆర్ఎస్

ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. పర్మినెంట్‌‌గా పని చేస్తున్న ఉద్యోగులకు వీఆర్ఎస్ (స్వచ్చంద విరమణ) ఆఫర్ ప్రకటించింది. వీఆర్ఎస్ తీసుకొనే ఉద్యోగులకు ప్రత్యేకంగా ప్రోత్సాహకాలని అందివ్వడం జరుగుతుందని వెల్లడించింది. 55 సంవత్సరాలున్న క్యాబిన్ క్రూ సిబ్బందితో పాటు వివిధ విభాగాల్లో పని చేస్తున్న శాశ్వత ఉద్యోగులు వీఆర్ఎస్  (VRS) తీసుకోవచ్చని సూచించింది. జూన్ 01వ తేదీ నుంచి జూలై 31 వరకు స్వచ్చందంగా రాజీనామా చేస్తారో.. వారికి ఒకేసారి టాటా గ్రూప్ ఎక్స్ గ్రేషియా, బోనస్‌‌లు ఇవ్వనున్నామని ఎయిర్ ఇండియా చీఫ్ హెచ్ఆర్ విభాగం అధికారి సురేష్ దత్ త్రిపాఠీ వెల్లడించారు. దాదాపు 70 ఏళ్ల తర్వాత ఎయిర్ ఇండియాను టాటా సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టాటా గ్రూప్ అధినేత రతన్ టాటా కీలక నిర్ణయం తీసుకోవడం గమనార్హం. గత సంవత్సరం అక్టోబర్ నెలలో జరిగిన బిడ్‌‌లో ఉద్యోగుల వీఆర్ఎస్, తొలగింపుపై ముందుస్తుగానే వెల్లడించింది. అప్పటి లెక్కల ప్రకారం.. మొత్తం 12 వేల 085 మంది ఉద్యోగులున్నారు.

వీరిలో 8 వేల 084 మంది పర్మినెంట్ ఉద్యోగులు, 4 వేల 001 కాంట్రాక్ట్ ఉద్యోగులు, ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ లో వేయి 534 మంది విధులు నిర్వహిస్తున్నట్లు తేలింది. వచ్చే ఐదు సంవత్సరాల్లో సంవత్సరానికి 1000 మంది చొప్పున మొత్తం 5 వేల మంది రిటైర్ కానున్నట్లు అంచనా వేస్తున్నారు. శాశ్వత ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటూనే.. సంస్థలో కొత్త మందిని తీసుకోవాలని ఎయిర్ ఇండియా యాజమాన్యం భావిస్తోంది. వివిధ విభాగాల్లో నియామక ప్రక్రియను కూడా ప్రారంభించిందని తెలుస్తోంది. కేబిన్ సిబ్బంది కోసం కోల్ కతా, బెంగళూరు, హైదరాబాద్, ముంబాయి నగరాల్లో వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. కంపెనీని పునరుద్ధరించాలనే ఉద్ధేశ్యంతో ఈ నియామకాలు చేపడుతోంది. 

మరిన్ని వార్తల కోసం : -

జమ్మూలో ఉగ్రవాదుల దుశ్చర్య


కేసీఆర్ పాలనలో నెంబర్ వన్ అవినీతి రాష్ట్రంగా తెలంగాణ