పెట్రోల్ వ్యాట్ పై కేంద్రమంత్రికి కేటీఆర్ కౌంటర్

పెట్రోల్ వ్యాట్ పై కేంద్రమంత్రికి కేటీఆర్ కౌంటర్
  • తెలంగాణ సర్కార్ 56 వేల కోట్ల వ్యాట్‌‌ వసూలు చేసింది : కేంద్ర మంత్రి పూరి
  • మేం వ్యాట్‌‌ పెంచనే లేదు : మంత్రి కేటీఆర్‌‌

హైదరాబాద్‌‌, వెలుగు: ట్విట్టర్‌‌ వేదికగా పెట్రో ధరలపై మంట చెలరేగింది. తెలంగాణ సర్కార్ పెట్రోల్‌‌పై 35.20 శాతం, డీజిల్‌‌పై 27 శాతం వ్యాట్‌‌ వసూలు చేస్తోందని, ఇలా 2014 నుంచి 2021 వరకు వ్యాట్‌‌ రూపంలో రూ.56,020 కోట్ల ఆదాయం సమకూర్చుకుందని కేంద్ర మంత్రి హర్దీప్‌‌సింగ్‌‌ పూరి గురువారం ట్వీట్‌‌ చేశారు. పెరిగిన ధరలతో 2021–-22 లో ఇంకో రూ.13,315 కోట్ల ఆదాయం సమకూరనుందని, మొత్తంగా వ్యాట్‌‌ ఆదాయం రూ.69,334 కోట్లకు చేరుతుందని పేర్కొన్నారు. కేంద్ర మంత్రి ట్వీట్‌‌కు మంత్రి కేటీఆర్‌‌ కౌంటర్‌‌ ఇచ్చారు. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి పెట్రో ఉత్పత్తులపై తాము వ్యాట్‌‌ పెంచనే లేదని తెలిపారు. 2014లో బ్యారల్‌‌ క్రూడాయిల్‌‌ ధర 105 డాలర్లుంటే, ఇప్పుడూ అంతే ఉందని.. అప్పుడు లీటర్‌‌ పెట్రోల్‌‌ రూ.70కు అమ్మితే ఇప్పుడు రూ.120లకు పైగా ఎలా పెరిగిందో చెప్పాలని కేంద్ర మంత్రిని ప్రశ్నించారు. ఇందుకు కేంద్రంలో ఉన్న నాన్‌‌ పర్ఫార్మింగ్‌‌ అస్సెస్‌‌ (ఎన్‌‌పీఏ) గవర్నమెంటే కారణమన్నారు. ఎన్‌‌డీఏ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎక్సైజ్‌‌ డ్యూటీ, సెస్సులు పెంచడంతోనే పెట్రో ధరలు పెరిగింది నిజం కాదా చెప్పాలన్నారు. కేంద్రం ఇప్పటి దాకా సెస్సుల రూపంలో రూ.26 లక్షల కోట్లు ప్రజల నుంచి గుంజుకున్నది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. వ్యాట్‌‌ తగ్గించాలని రాష్ట్రాలకు నీతులు చెప్పే కేంద్రం సెస్సులు పూర్తిగా రద్దు చేస్తే లీటర్‌‌ పెట్రోల్‌‌ రూ.70కి, డీజిల్‌‌ రూ.60కే ఇచ్చే అవకాశముందని తెలిపారు. ఇదే విషయం ప్రధాన మంత్రికి చెప్తే మంచిదని సూచించారు.