- ఎగుమతులు పడిపోతే రైతులపై ప్రభావం
- యాసంగిలో సగాని కన్నా ఎక్కువగా రానున్న దొడ్డు ధాన్యం
- ప్రత్యామ్నాయ మార్కెట్లపై ప్రభుత్వం దృష్టి
హైదరాబాద్, వెలుగు: పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ ప్రభావం తెలంగాణ నుంచి జరిగే బియ్యం, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇరాన్–ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతల కారణంగా ఇరాన్, ఇరాక్, కువైట్, ఖతార్, బహ్రెయిన్ వంటి దేశాలకు వెళ్లాల్సిన బియ్యం ఎగుమతులు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో ఎగుమతుల భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొనగా, మార్కెట్‌లో ధరలు కూడా పడిపోతున్నాయి.
ప్రస్తుతం యాసంగి సీజన్‌లో భారీగా ధాన్యం మార్కెట్‌లోకి రానుండగా, ఎగుమతులు స్తంభించడం రైతులు, మిల్లర్లలో ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా ఈ సీజన్‌లో సగానికి పైగా దొడ్డు రకాల ధాన్యం ఉత్పత్తి కానుండడంతో వాటి విక్రయాలపై సందిగ్ధం ఏర్పడింది. రాష్ట్రం నుంచి సాధారణంగా సౌదీ అరేబియా, ఒమన్, ఖతార్, బహ్రెయిన్, యూఏఈ, కువైట్ వంటి గల్ఫ్ దేశాలకు పెద్దఎత్తున బియ్యం ఎగుమతి అవుతుంటుంది.
అయితే, యుద్ధ పరిస్థితుల కారణంగా షిప్పింగ్ మార్గాలు సంక్లిష్టం కావడం, బీమా ఖర్చులు పెరగడం వల్ల వ్యాపారులు ఎగుమతులకు వెనుకాడుతున్నారు. దీంతో దేశవ్యాప్తంగా దాదాపు నాలుగు లక్షల టన్నుల బియ్యం.. పోర్టులు, గిడ్డంగుల్లో నిలిచిపోయిందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. ఈ పరిస్థితి కొనసాగితే మిల్లర్లు, ఎగుమతిదారులు తీవ్ర నష్టాలు చవిచూడాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
బియ్యం ఎగుమతులపై వీడని డైలమా
రాష్ట్రం నుంచి ఫిలిప్పీన్స్‌కు మాత్రమే గత ఏడాదిగా రెండు లక్షల టన్నుల బియ్యం ఎగుమతి అవుతోంది. ఇదే సమయంలో నైజీరియా, బెనిన్, టోగో వంటి పశ్చిమ ఆఫ్రికా దేశాలకు దొడ్డు బియ్యం (పార్‌బాయిల్డ్ రైస్) ఎగుమతి చేసే అవకాశాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. తాజాగా యుద్ధంతో గల్ఫ్ మార్కెట్లకు వెళ్లకపోవడం మరోవైపు ఇదే మార్గంలో ఆఫ్రికా దేశాలకు పంపే అవకాశాలు సైతం సన్నగిల్లినట్లయింది.
విదేశీ ఎగుమతులు ఆగిపోవడంతో మార్కెట్‌లో సరఫరా పెరిగి ధరలు క్రమంగా పడిపోతున్నాయి. ఈనెల ప్రారంభంలో క్వింటాల్‌కు రూ.2,550 ఉన్న దొడ్డు ధాన్యం ధర ప్రస్తుతం రూ.2,450కు తగ్గింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే మరో రూ.100 నుంచి రూ.150 వరకు తగ్గే అవకాశం ఉందని మిల్లర్లు అంచనా వేస్తున్నారు. ఈ సీజన్‌లో రాష్ట్రంలో సుమారు 145 లక్షల టన్నుల ధాన్యం మార్కెట్‌లోకి రానుండగా, ఎగుమతులు నిలిచిపోవడం డైలమా కొనసాగుతోంది.
వ్యవసాయ ఉత్పత్తులపై తీవ్ర ప్రభావం
యుద్ధ పరిస్థితులు కొనసాగితే బియ్యం ఎగుమతులు మాత్రమే కాకుండా మామిడి, మిర్చి, పసుపు, మొక్కజొన్న వంటి ఇతర వ్యవసాయ ఉత్పత్తులపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. రాష్ట్రం నుంచి ఏటా గల్ఫ్ దేశాలకు మామిడిపండ్లు, మామిడి పచ్చళ్లను అధికంగా పంపిస్తారు. ఈవారంలోనే అవి ప్రారంభం కావాల్సి ఉంది. బత్తాయి, ద్రాక్ష, నిమ్మ, మిర్చి, పసుపు, సోయా ఉత్పత్తులు ఈనెలలోనే వెళ్లాల్సి ఉంది. చిరుధాన్యాల ఉత్పత్తులకు గల్ఫ్ దేశాల నుంచి భారీఎత్తున ఆర్డర్లు వస్తున్నాయి. ఇవన్నీ సందిగ్ధంలో పడ్డాయి. గత కొన్నేళ్ల పాటు ఎగుమతుల వల్ల రైతులకు మంచి ధరలు లభించాయి. ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లు మూసుకుపోవడంతో దేశీయ మార్కెట్‌పైనే ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో రైతులకు గిట్టుబాటు ధరలు దక్కకపోయే ప్రమాదం ఉందని రైతు సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వం సమీక్షిస్తోంది. దొడ్డు ధాన్యానికి ప్రత్యామ్నాయ ఎగుమతి మార్కెట్లు కల్పించడం, విదేశాలతో ఒప్పందాలు కుదుర్చుకోవడం వంటి చర్యలపై దృష్టి సారిస్తోంది.
