వరంగల్​ కార్పొరేషన్‍ కాంట్రాక్టర్ల సమ్మె వార్నింగ్

వరంగల్​ కార్పొరేషన్‍ కాంట్రాక్టర్ల సమ్మె వార్నింగ్
  • పాతవి, కొత్తవి కలిపి రూ.90 కోట్లు పెండింగ్‍   
  • డిసెంబర్‍ 7 వరకు డెడ్‍లైన్‍.. 8 నుంచి పనులు బంద్​  

వరంగల్‍/వరంగల్ సిటీ, వెలుగు : గ్రేటర్‍ వరంగల్‍ కార్పొరేషన్‍ పరిధిలో రోడ్లు, డ్రైనేజీలు, మంచినీటి పైపుల లీకేజీ పనులు చేసిన కాంట్రాక్టర్లకు అధికారులు బిల్లులివ్వకుండా తిప్పించుకుంటున్నారు. తొమ్మిది నెలలుగా బిల్లులు ఆపడంతో కాంట్రాక్టర్లు సోమవారం గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు నిరసనకు దిగారు. కమిషనర్‍ ప్రావీణ్యకు లెటర్‍ ఇచ్చారు. తమ సమస్య పరిష్కరించకపోతే ఈ నెల 8 నుంచి సమ్మెకు వెళ్తామని హెచ్చరించారు. 

పాత బిల్లులియ్యట్లే.. కొత్త బిల్లులు చేయట్లే

కార్పొరేషన్‍ పరిధిలో చేపట్టే రోడ్లు, డ్రైనేజీలు, పైపులైన్‍, వాటర్‍ లీకేజీలు వంటి సివిల్‍ వర్క్స్ ను హన్మకొండ సిటీ పరిధిలో 200 మంది కాంట్రాక్టర్లు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయాల్సిన చీఫ్‍ మినిస్టర్​అష్యూరెన్స్​(సీఎంఏ), సబ్‍ ప్లాన్‍తో పాటు లోకల్‍గా కమిషనర్‍ స్థాయిలో బిల్లులు చెల్లించే జనరల్‍ ఫండ్స్​నుంచి వీటిని చేస్తున్నారు. కాగా, సీఎంఏ, సబ్​ప్లాన్​బిల్లుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, జనరల్‍ ఫండ్స్​విషయంలో గ్రేటర్‍ అధికారులు కాంట్రాక్టర్లు చేపట్టిన పనులకు ఏప్రిల్‍ నెల నుంచి బిల్లులివ్వలేదు. ఇప్పటికే పెండింగ్‍ బిల్లులు దాదాపు రూ.30 కోట్లు రావాల్సి ఉండగా..మరో రూ.30 కోట్ల బిల్లులు చేసి ఫండ్స్​ఇవ్వడం లేదు. కొన్ని నెలలుగా చేస్తున్న పనులకు సంబంధించి ఇంకో రూ.30 కోట్ల బిల్లులను అధికారులు చెల్లించాల్సి ఉంది. మొత్తంగా కాంట్రాక్టర్లకు రూ.80 కోట్ల నుంచి రూ.90 కోట్లు రావాల్సి ఉంది.  

రేట్లు పెరిగినయ్‍..బిల్లు కట్టిచ్చుడు తగ్గింది

కాంట్రాక్టర్లు బల్దియా పనులు చేసే క్రమంలో గతంలో సీసీ రోడ్ల నిర్మాణంలో ఒక్కో క్యూబిక్‍ మీటర్‍కు రూ.6800 చెల్లించగా ప్రస్తుతం కొందరు అధికారులు రూ.5600 కు తగ్గించడంపై కాంట్రాక్టర్లు ఫైర్‍ అవుతున్నారు. కరోనా తర్వాత మార్కెట్​లో ఇసుక, కంకర, సిమెంట్‍ వంటి మెటీరియల్‍ ధరలు విపరీతంగా పెరిగాయని..ఈ టైంలో తగ్గించడమేంటని ప్రశ్నిస్తున్నారు. సీసీ రోడ్స్​గైడ్‍లైన్స్​ ప్రకారం 85 శాతం పనులు పూర్తయిన పనులకు బిల్లులివ్వాల్సి ఉండగా..కొందరు అధికారులు నెలలు గడిచినా ఇవ్వడం లేదన్నారు. అలాంటి వారిపై కమిషనర్‍, మేయర్‍, ఎమ్మెల్యే, కలెక్టర్‍కు ఫిర్యాదు చేసినా ఫలితం లేదన్నారు. అందుకే ఈనెల 7 వరకు డెడ్‍లైన్‍ పెట్టామని, అప్పటికీ స్పందించకుంటే 8వ తేదీ నుంచి సమ్మెకు దిగనున్నట్లు చెప్పారు. 

పనులు ఆపుతం

తొమ్మిది నెలల నుంచి చేసిన పనులకు బిల్లులు ఇవ్వకుండా కార్పొరేషన్‍ అధికారులు తిప్పుకుంటున్నరు. వడ్డీకి బయటనుంచి లక్షలు అప్పు తీసుకొచ్చి పనులు చేసినం. తీరాచూస్తే సీఎంఏ, సబ్‍ ప్లాన్‍ ఫండ్స్​రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఇవ్వలేదని చెబుతున్నరు. లోకల్‍గా కమిషనర్‍ చేతిలో ఉండే జనరల్‍ ఫండ్స్ బిల్లులు కూడా ఇవ్వట్లేదు. ఇదే విషయమై ఎన్నోసార్లు కమిషనర్‍, మేయర్‍ను కలిసి రిక్వెస్ట్​చేసినం. అయినా ఫలితం లేదు. మాకొచ్చే బిల్లుల కోసం బుధవారం వరకు ఎదురుచూస్తాం. గురువారం నుంచి సమ్మెకు దిగి పనులు ఆపేస్తాం. - కె.రాజారావు  (హన్మకొండ యూనియన్‍ ప్రెసిడెంట్‍)