లింగ నిర్ధారణ పరీక్షలు..18 మందిని అరెస్ట్ చేశాం : వరంగల్ సీపీ

లింగ నిర్ధారణ పరీక్షలు..18 మందిని అరెస్ట్ చేశాం : వరంగల్ సీపీ

వరంగల్ లో లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న ముఠాను పోలీసులు గుట్టు రట్టు చేశారు.  18 మందిని అరెస్ట్ చేశామని  ..మరికొందరు పరారీలో ఉన్నారని  వరంగల్ సీపీ రంగనాథ్  చెప్పారు.  వరంగల్ లో కొన్ని హాస్పిటల్స్ లో  ఇల్లీగల్ అబార్షన్లు, ఆపరేషన్లు చేస్తున్నట్లు గుర్తించామన్నారు.  అబార్షన్లపై వరంగల్ లో డీసీపీ పుష్ప  నేతృత్వంతో స్టింగ్ ఆపరేషన్ చేశామని వెల్లడించారు.  అరెస్ట్ అయిన వారిలో కొందరు ప్రభుత్వ, ప్రైవేట్ డాక్టర్లు ఉన్నారని చెప్పారు. 

క్వాలిఫికేషన్  లేకుండానే స్కానింగ్,  ఆపరేషన్లు చేస్తున్నారని తెలిపారు.    ఒక్కొక్కరికి ఒక్కో రేటు తీసుకుంటున్నారని అన్నారు.  స్కానింగ్ మిషన్లు సప్లై చేసే వాళ్లపై స్పెషల్ ఫోకస్ పెట్టామని చెప్పారు.  అనాథరైజ్డ్ ఆపరేషన్లతో మరణాలు సంభవిస్తున్నాయని అన్నారు. మగపిల్లలు కావాలనుకునే వారిని ఈ ముఠా ఆసరగా తీసుకుంటుందని తెలిపారు. క్వాలిఫికేషన్ లేకున్నా  ఆపరేషన్లు చేయడంతో కొందరు అనారోగ్యానికి గురవుతున్నారని అన్నారు. ఆపరేషన్లు చేశాక మహిళల పరిస్థితి సీరియస్ గా ఉంటే చేతులు దులుపుకుంటున్నారని వెల్లడించారు.

రూల్స్​ను బ్రేక్​ చేస్తూ లింగనిర్ధారణ పరీక్షలు

వరంగల్ లో  స్కానింగ్‍ సెంటర్ల పేరుతో ఆస్పత్రులు పెడుతున్న కొంతమంది డాక్టర్లు స్కానింగ్​, అబార్షన్ల దందా  నడుపుతున్నారు.   రూల్స్​ను బ్రేక్​ చేస్తూ లింగనిర్ధారణ చేస్తున్నారు. స్కానింగ్​ అయితే రూ. 10 వేలు  తీసుకుంటున్నారు. ఒకవేళ ఆడపిల్ల అని తేలితే అబార్షన్​ చేసేందుకు రూ. 50 వేల దాకా దండుకుంటున్నారు.   గ్రేటర్‍ వరంగల్‍ సిటీలో పలు స్కానింగ్‍ సెంటర్ల డాక్టర్లు, వారికి సహకరించే ఆర్‍ఎంపీలు దీనిని ప్రొఫెషనల్‍గా మార్చుకుంటున్నారనే ఆరోపణలు వినబడుతున్నాయి. రెండేళ్ల క్రితమే   ఇలాంటి వరుస ఘటనలు  వెలుగులోకి వచ్చాయి.   అప్పుడు అధికారులు హడావుడి  చేసి పలు స్కానింగ్‍ సెంటర్లపై దాడులు నిర్వహించారు. అయితే మళ్లీ ఆ దందా బయటకు రావడంతో   పోలీసులు రంగంలోకి దిగి పలువురిని తమ అదుపులోకి తీసుకున్నారు. 

వెంకన్నస్వామి, లక్ష్మీదేవి ఫోటోలతో..

కడుపులో ఉండే బిడ్డ  ఆడో, మగో  తల్లిదండ్రులకు చెప్పుందుకు నిర్వాహకులు కోడ్​ లాంగ్వేజీ వాడుతున్నారు.  దీనికి కోసం దేవుళ్ల ఫొటోలు ఉపయోగిస్తున్నారు.  తమవద్దకు వచ్చే తల్లిదండ్రులకు లింగ నిర్థారణ పరీక్షలు చేసే క్రమంలో సెంటర్‍ లోపలకు ఎవ్వరినీ మొబైల్‍ తీసుకురాకుండా జాగ్రత్తలు పడుతున్నారు. నోటిమాటతో కాకుండా కడుపులో ఉన్నది చెప్పడానికి అబ్బాయైతే రాముడు, వెంకన్న స్వామి ఫోటోలు.. ఆడపిల్ల అయితే లక్ష్మిదేవి, సరస్వతి ఫోటోలను చూపుతున్నారు. కొంత దగ్గరివారైతే  'మీ పాప చాలా యాక్టివ్‍గా ఉందమ్మా' అని..  బాబు అయితే 'మీ అబ్బాయి చాలా యాక్టివ్‍గా ఉన్నాడని'     సమాచారాన్ని చేరవేస్తున్నారు.