సహకార సేవల విస్తరణ.. రైతులకు మరింత చేరువయ్యేలా జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ కసరత్తు

సహకార సేవల విస్తరణ.. రైతులకు మరింత చేరువయ్యేలా జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ కసరత్తు
  • రూరల్ ఏరియాల్లో సేవలు పెంచేందుకు ప్లాన్
  •  ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇప్పటికే 32 బ్రాంచ్ లు
  •  తాజాగా మరో ఏడు ఏర్పాటుకు ఆర్బీఐ గ్రీన్ సిగ్నల్
  •  తొందర్లోనే మిగతా మండలాల్లోనూ సేవలు

హనుమకొండ, వెలుగు: రైతులు, గ్రామీణ ప్రాంతాలకు సహకార సేవలను మరింత చేరువ చేసేందుకు వరంగల్ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ కసరత్తు చేస్తోంది. దాదాపు రూ.2,500 కోట్ల టర్నోవర్ తో లాభాల బాటలో నడుస్తున్న డీసీసీబీ, ఉమ్మడి జిల్లాలోని మరిన్ని ప్రాంతాలకు సేవలు విస్తరించేందుకు ప్లాన్ చేసింది. ఇందులో భాగంగానే రూరల్ ఏరియాల్లో బ్యాంక్ శాఖలు ఏర్పాటు చేసేలా చర్యలు చేపడుతోంది. ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 32 బ్రాంచ్ లు పని చేస్తుండగా, తాజాగా మరో ఏడు ఏర్పాటుకు ఆర్బీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ప్రైవేటు బ్యాంకులకు దీటుగా సేవలందించేలా డీసీసీబీ ముందుకుసాగుతోంది.

రూరల్ ఏరియాలకు చేరువయ్యేలా..

రాష్ట్రంలోని అతి పురాతన బ్యాంక్ లలో వరంగల్ డీసీసీబీ ఒకటి. 1917 ఆగస్టు 4న ఏర్పడిన ఈ బ్యాంక్ క్రమంగా సేవలను విస్తరిస్తూ వచ్చింది. ప్రస్తుతం వివిధ డిపాజిట్, లోన్ స్కీమ్స్ తో ప్రైవేటు బ్యాంకులకు దీటుగా సేవలందిస్తోంది. ముఖ్యంగా రైతులకు పంట రుణాలతో పాటు వారి పిల్లల చదువులకు, మహిళా సంఘాలకు, పశువుల పెంపకానికి, చిరు వ్యాపారులకు లోన్లు ఇస్తోంది. వాటికి అదనంగా హోమ్ లోన్స్, వెహికల్, పర్సనల్ లోన్స్ కూడా అందిస్తోంది. ఇప్పటివరకు రూ.727 కోట్ల రుణాలు, రూ.541 కోట్లు గోల్డ్ లోన్స్ మంజూరు చేసింది. ఇలా గతేడాది డిపాజిట్లు, లోన్లు అన్నీ కలిపి వరంగల్ డీసీసీబీ దాదాపు రూ.2,500 కోట్ల టర్నోవర్ సాధించింది. ఈ నేపథ్యంలోనే బ్యాంక్ సేవలను ఉమ్మడి జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలకు చేరువ చేసేందుకు డీసీసీబీ బ్రాంచ్ లను విస్తరించే పనిలో పడింది.

కొత్తగా మరో ఏడు బ్రాంచ్​లు..

వరంగల్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ వరంగల్, హనుమకొండ, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, సిద్దిపేట (చేర్యాల) జిల్లాల్లో విస్తరించి ఉంది. వీటి పరిధిలో 32 బ్రాంచ్ లు ఉండగా, వాటిలో 3.10 లక్షల మంది వరకు ఖాతాదారులున్నారు. కాగా, డీసీసీబీ సేవలను గ్రామస్థాయికి విస్తరించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ మేరకు ఉమ్మడి వరంగల్ లోని వివిధ మండలాల్లో కొత్త బ్రాంచ్ ల ఏర్పాటుకు ప్రపోజల్స్ పంపగా, అందులో ఏడు బ్రాంచ్ ల ఏర్పాటుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఇటీవల అనుమతి ఇచ్చింది. దీంతో ఆర్బీఐ నిబంధనల ప్రకారం కొత్తగా ఏడు మండలాల్లో డీసీసీబీ బ్రాంచ్ లను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో హనుమకొండ జిల్లాలోని హసన్ పర్తి, వరంగల్ జిల్లా సంగెం, జనగామ జిల్లా రఘునాథపల్లి మండల కేంద్రాల్లో బ్రాంచ్ లు ఇటీవలే ప్రారంభమయ్యాయి. వీటితో పాటు జనగామ జిల్లా దేవరుప్పుల, మహబూబాబాద్ జిల్లా కురవి, నెల్లికుదురు, జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలకేంద్రాల్లో మరికొద్దిరోజుల్లోనే బ్రాంచ్ లను ఏర్పాటు చేయనున్నారు. 

తొందర్లోనే మిగతా చోట్లా..!

ఉమ్మడి  జిల్లాలో 77 మండలాలు ఉండగా, హనుమకొండ జిల్లాలో 7, వరంగల్ జిల్లాలో 7, మహబూబాబాద్ జిల్లాలో 7, జనగామ 5, ములుగు 3, జయశంకర్ భూపాలపల్లిలో 2, సిద్దిపేట జిల్లా చేర్యాలలో ఒక బ్రాంచ్ చొప్పున డీసీసీబీ బ్రాంచ్ లు ఉన్నాయి. కొత్తగా ఏర్పడుతున్న ఏడింటితో కలిసి మొత్తంగా 39 బ్రాంచ్ లు అవుతున్నాయి. కాగా, డీసీసీబీ విస్తరణతో పాటు రైతులకు చేరువయ్యేందుకు ప్రతి మండలంలో ఒక బ్రాంచ్ ఏర్పాటు దిశగా అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఆర్బీఐ అనుమతులు రాగానే మిగతా చోట్లా డీసీసీబీ బ్రాంచ్ ఓపెన్ చేసి, ఖాతాదారులు, రైతులకు మెరుగైన సేవలందించేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు.

గ్రామస్థాయికి చేరువయ్యేలా చర్యలు..

వరంగల్ డీసీసీబీ పరిధిలో 32 బ్రాంచ్ లు, 70 ప్రాథమిక సహకార సంఘాల ద్వారా సేవలందిస్తున్నాం. కొత్తగా మరో ఏడు బ్రాంచ్ ల ఏర్పాటుకు అనుమతులు వచ్చాయి. అందులో ఇప్పటికే మూడు ఏర్పాటు చేశాం. ఇంకో నాలుగు తొందర్లోనే ప్రారంభిస్తాం. డీసీసీబీ సేవలను గ్రామస్థాయికి చేరువయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం. వజీర్ సుల్తాన్, సీఈవో, డీసీసీబీ