ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఏటూరునాగారం, వెలుగు: పోడు భూములు సాగు చేస్తున్న ఆదివాసీలందరికీ హక్కు పత్రాలు ఇవ్వాలని తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు వట్టం ఉపేందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం ములుగు జిల్లా ఏటూరునాగారంలో నిరసన తెలిపారు. వై జంక్షన్ నుంచి ఐటీడీఏ వరకు భారీ ర్యాలీ తీశారు. ఏండ్ల తరబడి సాగు చేసుకుంటున్న పోడు రైతులను.. ఆక్రమణదారులుగా చూడడం సరికాదన్నారు. పెస గ్రామ సభ తీర్మానం మేరకు అర్హులందరికీ హక్కు పత్రాలు ఇవ్వాలన్నారు. అనంతరం ఐపీవో వసంతరావుకు వినతి పత్రం అందించారు.

మంత్రిపై ఆదివాసీల ఫైర్..

ఆదివాసీలు అక్రమ వలసదారులని, గుత్తికోయలు ఆదివాసీలు కాదని ఇటీవల మంత్రి సత్యవతి రాథోడ్ చేసిన వ్యాఖ్యల పట్ల తుడుందెబ్బ నాయకులు మండిపడ్డారు. మంత్రి సత్యవతి రాథోడ్ కర్నాటక నుంచి ఇక్కడికి వలస వచ్చి, అక్రమంగా ఎస్టీ హోదా అనుభవిస్తూ.. గిరిజన మంత్రి అయ్యారని ఆరోపించారు. వెంటనే ఆదివాసీలకు మంత్రి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో తుడుందెబ్బ జాతీయ కోకన్వీనర్ పొడెం రత్నం, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కబ్బాక శ్రావణ్ కుమార్, రాష్ట్ర కార్యదర్శి పాయం జానకి రమణ తదితరులున్నారు.

మంత్రిని బర్తరఫ్ చేయాలి

ములుగు: గొత్తికోయలు ఆదివాసీలు కాదని ఇటీవల మంత్రి సత్యవతి రాథోడ్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ములుగులో ఆదివాసీలు ధర్నా చేశారు. ఈ సందర్భంగా తుడుందెబ్బ రాష్ట్ర వర్కింగ్​ప్రెసిడెంట్ మైపతి అరుణ్ కుమార్ మాట్లాడుతూ.. గోండ్వానా జాతి పూర్వీకులైన గొత్తికోయలు ముమ్మాటికీ తమ ఆదిమ జాతికి చెందిన వారేనని స్పష్టం చేశారు. గొత్తికోయలు ఎస్టీలు కాదని సర్టిఫికేట్ ఇచ్చే అర్హత మంత్రికి లేదన్నారు. మంత్రి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోకుంటే ఏజెన్సీ ప్రాంతంలో తిరగనివ్వమని హెచ్చరించారు. సీఎం కేసీఆర్ తక్షణమే సదరు మంత్రిని బర్తరఫ్ చేయాలన్నారు.

కేసీఆర్​ దీక్షా దివస్ చారిత్రక ఘట్టం : దాస్యం వినయ్​ భాస్కర్

హనుమకొండ, వెలుగు: మలిదశ తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ చేపట్టిన దీక్షా దివస్ ఒక చారిత్రక ఘట్టమని ప్రభుత్వ చీఫ్​ విప్​ దాస్యం వినయ్​ భాస్కర్​ అన్నారు. నవంబర్​29న దీక్షా దివస్ సందర్భంగా కాళోజీ  జంక్షన్ వద్ద 11 రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. హనుమకొండ బాలసముద్రంలోని టీఆర్​ఎస్​ పార్టీ ఆఫీస్​లో  వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్​, ఇతర లీడర్లతో కలిసి సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 29న కాళోజీ సెంటర్​ లో దీక్ష దివస్ ప్రారంభించి, 30న  జయశంకర్ పార్క్ నుంచి క్యాండిల్ ర్యాలీ,  డిసెంబర్ 1న బైక్ ర్యాలీ,  2న పబ్లిక్ గార్డెన్ లో ఫోటో ఎగ్జిబిషన్, 3న అమరవీరుల సభ, 4న కాజీపేట్ లో  ఆటపాటలతో ధూంధాం,  5న ఉద్యమంలో పాల్గొన్న జర్నలిస్ట్ ల ఆత్మీయ సమ్మేళనం, 6న అంబేద్కర్ ఆలోచన.. కేసీఆర్​ ఆచరణ సెమినార్, 7న విద్యార్థుల అలయ్ బలాయ్, 8న అన్ని డివిజన్లలో టీఆర్ఎస్​ జెండా ఎగరవేత,  ఆత్మీయ సమ్మేళనాలు, 9న పునరంకింత సభ ఉంటుందని ఆయన వివరించారు. సమావేశంలో కుడా చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ ఖాన్, మాజీ కుడా చైర్మన్ మర్రి యాదవ రెడ్డి, నాయకులు  జనార్దన్ గౌడ్, పులి రజినీకాంత్,మాజీ కార్పొరేటర్ జోరిక రమేష్,  నయీమొద్దీన్​,  పరుశురాములు తదితరులు పాల్గొన్నారు.

కార్మికుల సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తా : ఎమ్మెల్యే రాజయ్య

స్టేషన్ ఘన్​పూర్, వెలుగు: వ్యవసాయ కార్మికుల సమస్యలను వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్యే రాజయ్య హామీ ఇచ్చారు. జనగామ జిల్లా స్టేషన్​ఘన్​పూర్​లో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రెండ్రోజుల జిల్లా మహాసభలు స్టేషన్ ఘన్ పూర్ లో సోమవారం ప్రారంభయ్యాయి. చీఫ్ గెస్టుగా ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. వ్యవసాయ కార్మికుల సమస్యలు తీర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఆ సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఎన్నకూస కుమార్, జడ్పీ చైర్మన్ పాగాల సంపత్​రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్నకూస వెంకట్రాజం తదితరులున్నారు.

దళితబంధు ఇవ్వాలని వేడుకోలు..

దళితబంధు ఇచ్చి తమను ఆదుకోవాలని ఇద్దరు అనాథ అక్కచెల్లెళ్లు సోమవారం ఎమ్మెల్యే రాజయ్య కాళ్లపై పడ్డారు. జనగామ జిల్లా లింగాలఘనపురం మండలం కళ్లెం గ్రామానికి చెందిన అక్కాచెల్లెళ్లు అశ్విని, అనూష తల్లిదండ్రులు పదేండ్ల కింద చనిపోయారు. అనూష టెన్త్, అశ్విని డిగ్రీ ఫస్ట్ ఇయర్ వరకు చదివి మానేశారు. ఆర్థిక భారంతో కూలి పనులు చేసుకుంటున్నారు. దళితబంధు గురించి తెలుసుకుని, తమకు కూడా ఆర్థిక సాయం చేయాలని ఎమ్మెల్యేను వేడుకున్నారు. స్పందించిన ఎమ్మెల్యే ఇరువురికి దళితబంధు ఇస్తానని హామీ ఇచ్చారు.

పరకాలపై చల్లా వివక్ష : మొలుగూరి బిక్షపతి

పరకాల, వెలుగు: స్థానికేతరుడు కాబట్టే పరకాలపై ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి వివక్ష చూపిస్తూ.. అభివృద్ధి చేయడం లేదని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత మొలుగూరి బిక్షపతి ఆరోపించారు. సోమవారం పరకాల బాలికల ఉన్నత పాఠశాలను  మొలుగూరి పరిశీలించారు. నియోజకవర్గంలోని మొగిలిచర్ల, ధర్మారం తర్వాత అత్యధికంగా 250మంది విద్యార్థులన్న పరకాల గర్ల్స్ హైస్కూల్​ను ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదన్నారు. మన ఊరు–-మన బడి కింద రూ.65లక్షలు స్కూల్​కు కేటాయిస్తే.. ఇంతవరకు పనులు మొదలు పెట్టలేదన్నారు. అదనపు తరగతి గదుల నిర్మాణ పనులు సైతం మధ్యలోనే ఆగిపోయాయన్నారు. కౌన్సిలర్లు ఆర్పీ జయంతిలాల్, బెజ్జంకి పూర్ణాచారి, భద్రయ్య, మార్త బిక్షపతి, దేవునూరి మేఘనాథ్, రాజభద్రయ్య ఉన్నారు.