ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

మహాముత్తారం, వెలుగు: కామన్ గ్రేడ్ వడ్లను మిల్లర్లు నిరాకరిస్తుండడంతో అన్నదాతలు తిప్పలు పడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా మిల్లర్లు వ్యవహరిస్తున్నా.. ఆఫీసర్లు స్పందించడం లేదు. దీంతో వడ్ల రాశులు పేరుకుపోతున్నాయి. వివరాల్లోకి వెళితే.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో 9, జీసీసీ ఆధ్వర్యంలో 4, డీసీఎంఎస్​ఆధ్వర్యంలో 8, మ్యాక్స్​ఆధ్వర్యంలో 4  కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు పీఏసీఎస్​ కల్లం నుంచి ఒకే ఒక్క లారీ లోడ్ తరలించారు. మిల్లు యజమానులు కామన్​ గ్రేడ్ 1001 రకం వడ్లను నిరాకరిస్తుండడంతో కొనుగోళ్లు సాగడం లేదు. మండలంలో సగానికి పైగా రైతులు ఇదే రకం వడ్లను సాగు చేయడంతో.. ఆందోళన చెందుతున్నారు. వడ్లు కాంటాలు వేయకపోవడంతో కల్లాలన్నీ వడ్ల రాశులతో నిండిపోయాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించాలని రైతులు కోరుతున్నారు.

రాయపర్తిలో గోనె సంచుల లొల్లి..

రాయపర్తి, వెలుగు: వరంగల్ జిల్లా రాయపర్తి మండలకేంద్రంలోని వ్యవసాయ సబ్ యార్డు ఆవరణలో రైతులు ఆందోళన చేశారు. గోనె సంచులు కొంతమందికే ఇస్తున్నారని మండిపడ్డారు. రోజుల తరబడి ధాన్యం ఆరబోసి ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు.

ఎమ్మెల్యే పీఏను శిక్షించాలి

కాశిబుగ్గ, వెలుగు: దళిత మహిళపై లైంగిక దాడికి పాల్పడిన వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నరేందర్ పీఏను కఠినంగా శిక్షించాలని బీజేపీ, బీఎస్పీ పార్టీల లీడర్లు డిమాండ్ చేశారు. ఈమేరకు శనివారం కాశిబుగ్గ అంబేడ్కర్ జంక్షన్ లో ధర్నా చేశారు. అధికారం ఉందనే అహంకారంతోనే టీఆర్ఎస్ లీడర్లు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ అత్యాచార ఘటన వెనుక పెద్ద లీడర్ల హస్తం కూడా ఉందని ఆరోపించారు. కాగా, ధర్నా చేస్తున్న వారిని మిల్స్ కాలనీ పోలీసులు అరెస్టు చేసి స్టేషన్​కు తరలించారు.

అన్నిరంగాల్లో తెలంగాణ నంబర్ వన్​ : హోంమంత్రి మహమూద్​ అలీ

హనుమకొండ, వెలుగు: వ్యవసాయం, ఉద్యోగాలు, ఉపాధి కల్పనతో పాటు అన్నిరంగాల్లో తెలంగాణ దేశంలోనే నెంబర్​ వన్​ స్థానంలో ఉందని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్​ అలీ అన్నారు. ప్రభుత్వ చీఫ్ విప్​ దాస్యం వినయ్​ భాస్కర్​ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దీక్షా దివస్​ కార్యక్రమంలో పాల్గొనేందుకు శనివారం సాయంత్రం హోం మంత్రి మహమూద్​ అలీ వరంగల్ నగరానికి వచ్చారు. ముందుగా కాజీపేట బియాబానీ దర్గాను సందర్శించారు. హనుమకొండ రాయపురలోని జక్రియా ఫంక్షన్​ లో మైనార్టీ నాయకుల ఆత్మీయ సమ్మేళనానికి  చీఫ్​ గెస్ట్ గా హాజరయ్యారు. దేశంలో శాంతిభద్రతలు కంట్రోల్​ లో ఉన్న ఏకైక రాష్ట్రం కూడా తెలంగాణ మాత్రమేనన్నారు.

మోడల్ స్కూల్ సిబ్బంది పనితీరు మార్చుకోవాలి

పర్వతగిరి, వెలుగు: హాస్టల్​లో ఫుడ్ సరిగ్గా పెట్టడం లేదని, సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తున్నారని వరంగల్ జిల్లా పర్వతగిరి మోడల్ స్కూల్ స్టూడెంట్లు ఇటీవల ధర్నా చేయగా.. విషయం తెలుసుకున్న సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జె. ఉపేందర్ రావు శనివారం స్కూల్​ను సందర్శించారు. స్టూడెంట్లతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. వాటిని లిఖితపూర్వకంగా రాసుకున్నారు. కాగా, వండిన అన్నంలో పురుగులు ఉన్నాయని  ప్రత్యక్షంగా స్టూడెంట్లు చూపించగా.. సిబ్బందిపై జడ్జి ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్​కు ఫోన్ చేసి, ఇక్కడి పరిస్థితి వివరించారు. 

స్టూడెంట్ల సమస్యలు పరిష్కరించాలి..

పర్వతగిరి మోడల్ స్కూల్ స్టూడెంట్ల సమస్యలు పరిష్కరించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొండేటి శ్రీధర్, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు జాటోత్​శ్రీనివాస్ నాయక్ హెచ్చరించారు. శనివారం స్కూల్ ను వారు వేర్వేరుగా సందర్శించారు. బూతులు తిడుతున్న సిబ్బందిని సస్పెండ్ చేయాలన్నారు. క్వాలిటీ ఫుడ్ పెట్టుకుంటే ధర్నా చేస్తామన్నారు.

కేంద్ర పథకాలు గ్రామాలకు చేరాలి : ఎంపీ మాలోత్ కవిత

ములుగు, వెలుగు: కేంద్ర ప్రభుత్వ పథకాలు మారుమూల గ్రామాలకు సైతం చేర్చాలని మహబూబాబాద్ ఎంపీ, దిశ కమిటీ చైర్మన్ మాలోత్ కవిత ఆఫీసర్లను ఆదేశించారు. శనివారం ములుగు కలెక్టరేట్​లో కలెక్టర్ కృష్ణ ఆదిత్య అధ్యక్షతన జిల్లా అభివృద్ధి, సమన్వయ పర్యవేక్షణ కమిటీ(దిశ) మీటింగ్ జరిగింది. దిశ చైర్మన్ మాలోత్ కవిత హాజరై.. సెంట్రల్ స్కీములపై రివ్యూ చేశారు. క్షేత్రస్థాయిలో పథకాలు అమలు చేసే క్రమంలో ఇబ్బందులు ఎదురైతే ఉన్నతాధికారులను సంప్రదించాలన్నారు. దిశ మీటింగ్​కు జాతీయ రహదారులకు సంబంధించిన ఆఫీసర్లు హాజరుకాకపోవడంతో ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్​ జగదీశ్, కలెక్టర్ కృష్ణ ఆదిత్య, ఐటీడీఏ పీవో అంకిత్, అడిషనల్ కలెక్టర్ వైవీ గణేశ్, డిస్ట్రిక్ట్ లైబ్రరీ చైర్మన్ పోరిక గోవింద్ నాయక్, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు పల్లా బుచ్చయ్య తదితరులున్నారు.

దళితబంధు మాకెప్పుడు?

ములుగులో కాంగ్రెస్ వాళ్లకే దళితబంధు అందుతోందని, తమకెప్పుడు ఇస్తారని ఎంపీ కవితను టీఆర్ఎస్ లీడర్లు ప్రశ్నించారు. ఏండ్లుగా కష్టపడుతున్న టీఆర్ఎస్ వాళ్లకు దళితబంధు రాకపోవడం బాధాకరమన్నారు. కాగా, ఈ సమస్యను కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని ఎంపీ హామీ ఇచ్చారు.