- ఇండియా, సౌదీ అరేబియా పార్లమెంటరీ ఫ్రెండ్‌షిప్ గ్రూప్ సభ్యురాలిగా నామినేట్
న్యూఢిల్లీ, వెలుగు: వరంగల్ ఎంపీ కడియం కావ్యకు అరుదైన గౌరవం లభించింది. ఇండియా–సౌదీ అరేబియా పార్లమెంటరీ ఫ్రెండ్‌షిప్ గ్రూప్ సభ్యురాలిగా ఆమెను లోక్‌సభ స్పీకర్ నామినేట్ చేశారు. ఈ మేరకు లోక్‌సభ సెక్రటేరియట్ (కాన్ఫరెన్స్ అండ్ ప్రోటోకాల్ బ్రాంచ్) అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
భారత్, సౌదీ అరేబియాల మధ్య ఉన్న ద్వైపాక్షిక సంబంధాలను మరింత పటిష్టం చేసేందుకు, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంపొందించే ఉద్దేశంతో ఈ ఫ్రెండ్‌షిప్ గ్రూప్‌ను ఇటీవల ఏర్పాటు చేశారు.
పార్లమెంటరీ స్థాయిలో రెండు దేశాల మధ్య వారధిగా ఈ కమిటీ పనిచేయనుంది. తనపై నమ్మకంతో ఈ కీలక బాధ్యతను అప్పగించిన లోక్‌సభ స్పీకర్‌కు ఎంపీ కడియం కావ్య కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ‘‘భారత్, సౌదీ అరేబియా మధ్య సత్సంబంధాలను మెరుగుపరిచే దిశగా నా వంతు కృషి చేస్తాను. ఈ నామినేషన్ వరంగల్ నియోజకవర్గానికే కాకుండా, అంతర్జాతీయ వేదికపై తెలంగాణకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను’’ అని పేర్కొన్నారు.
