V6 News

వరంగల్‌‌‌‌లో రూ.2.5 కోట్ల హాష్ ఆయిల్ స్వాధీనం

వరంగల్‌‌‌‌లో రూ.2.5 కోట్ల హాష్ ఆయిల్ స్వాధీనం

వరంగల్, వెలుగు: ఒడిశా నుంచి వరంగల్​  మీదుగా ఏపీ, ముంబైకు తరలిస్తున్న రూ.2 కోట్ల 50 లక్షల విలువైన గాంజా హాష్ ఆయిల్‌‌‌‌ను వరంగల్ పోలీసులు పట్టుకుని నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వరంగల్ సీపీ సన్‌‌‌‌ప్రీత్ సింగ్ వివరాలు వెల్లడించారు. ఒడిశా రాష్ట్రం మల్కాన్‌‌‌‌గిరి జిల్లా చిత్రకొండ మండలం సువ్వపల్లి గ్రామానికి చెందిన హంటల్ సన్ను(23) తన గ్రామంలో హాష్ ఆయిల్‌‌‌‌ను తయారుచేశాడు. ముంబైకి తరలించేందుకు హంటల్ సన్యాసి(23), హంటల్ కృష్ణా(56), ఏపీలోని అల్లూరి జిల్లాకు చెందిన కండెల చిన్నబాబు(56)తో కలిసి ఈ నెల 19న తుని రైల్వే స్టేషన్ నుంచి బయల్దేరారు. వరంగల్ రైల్వే స్టేషన్‌‌‌‌లో పోలీసులు తనిఖీలు చేస్తున్నట్లు గమనించి ముందుగానే రైలు నుంచి వీరు దిగిపోయారు. మంగళవారం ముంబై వెళ్లేందుకు వరంగల్ బస్టాండ్ ప్రాంతానికి చేరుకున్నారు.

అనుమానాస్పదంగా తిరుగుతండడంతో వారిని తనిఖీ చేయగా 20 కిలోల హాష్ ఆయిల్‌‌‌‌ దొరికింది. అనంతరం సీపీ మాట్లాడుతూ కమిషనరేట్​ పరిధిలో స్కూళ్లు, కాలేజీలకు 100 మీటర్ల దూరంలో పాన్​షాపులు నడపడానికి వీల్లేదన్నారు. సెక్షన్‍ 6 ప్రకారం విద్యార్థులు చదువుకునే ప్రాంతాల్లో పొగాకు, గుట్కా, సిగరేట్ల విక్రయాలు ఉండకూడదనే నిబంధన ఉందన్నారు. దానినే కమిషనరేట్‍ పరిధిలో అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. నిబంధనలను విరుద్ధంగా విక్రయించేవారిపై సెక్షన్‍ 77 ప్రకారం కేసులు నమోదు చేయనున్నట్లు తెలిపారు.