హైదరాబాద్, వెలుగు: ‘టానిక్’ పేరు మీద సంతోష్‌తో కలిసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మద్యం వ్యాపారం చేయలేదా అని వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు ప్రశ్నించారు. ఆ మద్యం షాపు పేరుతో ఎంత దోచుకున్నారో నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నానని సవాల్ చేశారు. ఇదే విషయంపై జూబ్లీహిల్స్ లోని పెద్దమ్మ గుడిలో ప్రమాణం చేయడానికి కేటీఆర్ రెడీనా అని ప్రశ్నించారు. గురువారం గాంధీ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.
మద్యం టెండర్లలో సీఎం రేవంత్ రెడ్డి అల్లుడు ఉన్నారంటూ కేటీఆర్ అడ్డగోలుగా మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. కేటీఆర్‌కు లిక్కర్ గురించి మాట్లాడే అర్హతే లేదన్నారు. దేశంలో తెలంగాణకు విలువలేకుండా చేసిందే కేసీఆర్ కుటుంబమని, కేసీఆర్ అంటేనే లిక్కర్ మాఫియా అని ఆరోపించారు. మద్యం టెండర్లే లేవు, అక్రమాలు ఎక్కడియని ప్రశ్నించారు. ఐఏఎస్ ఆఫీసర్ రిజ్వీ మంచివారని, ఆయన ఇష్టంమేరకే వీఆర్ఎస్ తీసుకున్నారని నాగరాజు స్పష్టం చేశారు.
