
ప్రి–డయాబెటిక్, డయాబెటిస్.. ఈ రెండు కండీషన్స్‌లోనూ రక్తంలోని షుగర్ లెవల్స్ పెరుగుతాయి. దాంతో ఈ రెండింటినీ ఒకటే జబ్బు కింద లెక్కకడుతుంటారు అంతా. కానీ, నిజానికి ఇవి రెండూ వేరువేరు.. వీటి మధ్యనున్న వ్యత్యాసం తెలుసుకుంటే డయాబెటిక్ నుంచి తేలిగ్గా బయటపడొచ్చు అంటున్నారు కన్సల్టెంట్ ఇంటర్నల్ మెడిసిన్ డాక్టర్ అంకిత్ మౌళి.
సాధారణంగా శరీరం రక్తంలోని చక్కెరని కణాల్లోకి తీసుకుంటుంది. దాన్ని రోజువారీ అవసరాల కోసం ఎనర్జీగా ఉపయోగించుకుంటుంది. కానీ, అలా జరగనప్పుడు రక్తంలో పెద్ద మొత్తంలో చక్కెర పేరుకుపోతుంది. ఆ కండీషన్నే డయాబెటిస్ అంటారు. ఈ సమస్యని కంట్రోల్ చేయడం తప్ప పూర్తిగా నయం చేయలేం. కానీ, ప్రి– డయాబెటిక్ అలా కాదు. డయాబెటిస్‌కి ఒక వార్నింగ్ బెల్లా దీన్ని చెప్పొచ్చు. ఈ కండీషన్లోనూ రక్తంలో షుగర్ లెవల్స్ ఎక్కువగా ఉంటాయి. అయితే అవి టైప్–2 డయాబెటిస్ స్థాయిలో ఉండవు. మొదట్లోనే దీన్ని గుర్తించి.. లైఫ్ స్టయిల్లో చిన్న మార్పులు చేసుకుంటే డయాబెటిస్‌ని చాలాకాలం వాయిదా వేయొచ్చు. దానికన్నా ముందు అసలు ఈ రెండింటికి మధ్యనున్న తేడా తెలుసుకోవడం ముఖ్యం అంటున్నారు డాక్టర్ మౌళి.
ప్రి–డయాబెటిక్
మామూలుగా రక్తంలో చక్కెర శాతం 5.7 శాతం ఉంటుంది. డయాబెటిస్‌కి వచ్చేసరికి 6.5 శాతం ఉంటుంది. కానీ, ఈ రెండింటికి మధ్య 5.7 నుంచి 6.4 శాతం ఉంటే దాన్ని ప్రి–డయాబెటిక్‌గా చెప్తాం. డయాబెటిస్ మొదటి స్టేజ్‌లో ఇది ఒకటి. మరి దీన్ని గుర్తించడం ఎలా అంటే ప్రత్యేకంగా దీనికి సింప్టమ్స్ లేవు. కానీ, ఈ కింది లక్షణాలు ఉంటే తప్పనిసరిగా చెకప్ చేయించుకోవాలి.
- విపరీతమైన ఆకలి
- అలసట
- ఎక్కువసార్లు మూత్ర విసర్జన
- బరువు పెరగడం
- మాటిమాటికి గొంతు ఎండిపోవడం
డయాబెటిస్
ప్రి–డయాబెటిక్‌ని కంట్రోల్ చేయకపోతే డయాబెటిస్‌గా మారిపోతుంది. దాన్ని కూడా వెంటనే గుర్తించకపోతే రక్తంలోకి షుగర్ లెవల్స్ బాగా పెరిగి హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదం ఉంది. కిడ్నీలు, నరాలు కూడా దెబ్బతింటాయి. రక్తం గడ్డ కడుతుంది. బ్యాక్టీరియల్, ఫంగల్ ఇన్ఫెక్షన్లు చుట్టుముడతాయి. కంటి చూపు మందగిస్తుంది. డిప్రెషన్ ఛాయలు అల్లుకుంటాయి. అలా కాకూడదంటే డయాబెటిస్‌ని ప్రి–డయాబెటిక్ స్టేజ్‌లోనే కంట్రోల్ చేయాలి. అలా జరగకపోతే ఈ లక్షణాల్ని బట్టి డయాబెటిస్‌ని అయినా గుర్తించాలి. ప్రి–డయాబెటిక్ మాదిరిగానే విపరీతమైన ఆకలి, దప్పిక, అలసట, పదేపదే మూత్ర విసర్జన లాంటి లక్షణాలు ఉంటాయి డయాబెటిక్‌లో కూడా.
- నోరు పొడిబారుతుంది
- చర్మం దురద పెడుతుంది.
- కంటి చూపు మందగిస్తుంది
- కొన్ని సందర్భాల్లో ఈస్ట్ ఇన్ఫెక్షన్లు, పాదాలు, అరికాళ్ల నొప్పులు ఉంటాయి.
అయితే 45 ఏండ్లు పైబడిన వాళ్లకి, అధిక బరువు ఉన్నవాళ్లకి, ఫ్యామిలీలో ఎవరికైనా డయాబెటిస్ ఉన్నప్పుడు, సరిపడా ఫిజికల్ యాక్టివిటీ లేనివాళ్లకి డయాబెటిస్ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందుకే వీళ్లు ఇంకాస్త ఎక్కువ కేర్ తీసుకోవాలి.