హిందువులు శాంతి ప్రేమికులు.. అల్లర్లలో పాల్గొనరు : అస్సాం సీఎం

హిందువులు శాంతి ప్రేమికులు.. అల్లర్లలో పాల్గొనరు : అస్సాం సీఎం

కాంగ్రెస్‌లో ఉండి తన 22 సంవత్సరాల జీవితాన్ని వృథా చేసుకున్నానని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ అన్నారు. తాను కాంగ్రెస్‌ను విడిచిపెట్టి బీజేపీలోకి వచ్చినా సైద్ధాంతిక మార్పేమీ లేదని చెప్పారు. కాంగ్రెస్‌లో ఉన్నపుడు తాము ఆ కుటుంబాన్ని పూజించేవాళ్లమని, బీజేపీలో మాత్రం దేశాన్ని పూజిస్తున్నామన్నారు. ఒకప్పుడు అస్సాంలో కాంగ్రెస్ మంత్రిగా ఉన్న ఆయన 2015లో పార్టీ నుంచి నిష్క్రమించారు. ఆ తర్వాత బీజేపీ సర్కారులో మంత్రిగా, ఇప్పుడు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు. ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో హిమంత బిస్వ శర్మ ఈ వ్యాఖ్యలు చేశారు.

"లవ్ జిహాద్" పైనా...

ఢిల్లీలో ఇటీవల జరిగిన శ్రద్ధా వాకర్ హత్య పైనా అస్సాం సీఎం వ్యాఖ్యానించారు. లవ్ జిహాద్ కి వ్యతిరేకంగా కఠినమైన చట్టాలు తీసుకురావాలని డిమాండ్ చేశారు. "లవ్ జిహాద్" అంటే ఏమిటో చట్టబద్ధంగా నిర్వచించాల్సిన సమయం ఆసన్నమైంది, అందుకు తమ వద్ద చాలా ఆధారాలు ఉన్నాయని చెప్పారు. 

గుజరాత్ లో శాంతికి కారణం అక్కడి ప్రభుత్వమే..

ఇక అమిత్ షా ఇటీవల చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇస్తూ.. 2002 తర్వాత గుజరాత్ ప్రభుత్వం రాష్ట్రంలో శాంతి భద్రతలను నెలకొల్పేందుకు అనేక చర్యలు తీసుకుందని అస్సాం సీఎం చెప్పారు. గుజరాత్‌లో ప్రస్తుతం శాంతి ఉందని, ఇప్పుడు కర్ఫ్యూలు కూడా లేవన్నారు. అస్సాంలో కూడా అలాంటి వాతావరణం కోసం తాను పని చేస్తున్నానని చెప్పారు.ఇక హిందువులు శాంతి ప్రేమికులు అని, అల్లర్లకు దూరంగా ఉంటారన్నారు.  

సద్దాం హుస్సేన్ లా కనిపిస్తున్నాడు..

అస్సాం ముఖ్యమంత్రి, బీజేపీ ప్రముఖ ఎన్నికల ప్రచారకుడు హిమంత బిస్వ శర్మ, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీపైనా కామెంట్ చేశారు. భారత్ జోడో యాత్రలో గడ్డంతో ఉన్న రాహుల్ గాంధీని సద్దాం హుస్సేన్‌ తో పోల్చారు. రాహుల్ గాంధీ సద్దాం హుస్సేన్ లా కనిపిస్తున్నాడన్న ఆయన.. రాహుల్ గాంధీని కేవలం పదవీచ్యుతుడైన ఇరాకీ నియంతతో మాత్రతో పోల్చానని, అంతకు మించి ఇంకేమీ అనలేదన్నారు.