హైదరాబాద్, వెలుగు: ఎండలు మండుతున్న వేళ ఆర్టీసీ యాజమాన్యం ప్రయాణీకులకు షాక్ ఇచ్చింది. ఇన్నాళ్లూ రాజధాని, లహరి వంటి ఏసీ బస్సులతో పాటు డీలక్స్, సూపర్ లగ్జరీ వంటి లాంగ్ రూట్ బస్సుల్లో ‘జీవ’ సంస్థ పేరుతో ఇచ్చే వాటర్ బాటిల్‌ను పది రోజులుగా బంద్ పెట్టారు. కానీ వాటర్ బాటిల్ చార్జీ పేరుతో ప్రతి టికెట్‌పై రూ.10 మాత్రం వసూలు చేస్తూనే ఉన్నారు.
దీంతో బాటిల్ ఇవ్వనప్పుడు డబ్బులు ఎలా వసూలు చేస్తారంటూ ప్రయాణికులు ఆర్టీసీ సిబ్బందితో గొడవపడుతున్నారు. వాటర్ బాటిల్ అడిగితే ఆర్‌ఎంలు, డీఎంలకు ఫోన్ చేసుకోవాలని డ్రైవర్లు, కండక్టర్లు నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని ప్రయాణికులు వాపోతున్నారు.
రోజుకు రూ. కోటి వసూలు
హైదరాబాద్‌లోని జేబీఎస్‌తో పాటు వివిధ బస్టాండ్ల నుంచి సూపర్ లగ్జరీ, ఆ పై లెవల్బస్సుల్లో కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, మహబూబ్‌నగర్, ఖమ్మం, విజయవాడ, నల్గొండ వంటి దూర ప్రాంతాలకు వెళ్లే, వచ్చే ప్రయాణీకుల కోసం గతంలో 500 ఎంఎల్ వాటర్ బాటిల్ అందజేసేవారు. ఆర్టీసీ సంస్థే ‘జీవ’ అనే పేరుతో తాగునీటిని ఉత్పత్తి చేయించి, ప్రయాణికులకు సప్లై చేసేది. ఇందుకు ప్రతి బాటిల్‌పై రూ.10 చొప్పున వసూలు చేసేది.
ఇలా రాష్ట్ర వ్యాప్తంగా వసూలు చేసే చార్జి సుమారు రూ. కోటి వరకు ఉంటుందని ఆర్టీసీ వర్గాలు చెప్తున్నాయి. కాగా, ఆర్టీసీకి వాటర్ బాటిళ్లను సరఫరా చేసే ‘జీవ’ సంస్థ బాటిళ్ల సప్లై ఆపేసిందని, అందుకే ప్రయాణికులకు పంపిణీ చేయడం లేదని ఆర్టీసీ ఆఫీసర్లు చెబుతున్నారు. కానీ డబ్బులు ఎందుకు వసూలు చేస్తున్నారన్న ప్రశ్నకు మాత్రం సమాధానం ఇవ్వడం లేదు.
