గుక్కెడు నీటికోసం అల్లాడుతున్న గ్రామాలు

గుక్కెడు నీటికోసం అల్లాడుతున్న గ్రామాలు

తడారుతున్న గొంతులు..చుక్క నీటి కోసం తల్లడిల్లుతున్న ప్రాణాలు..కంటిచూపు మేర కన్పించని నీళ్లు. కన్పించినా  ప్రాణాలకు తెగిస్తే తప్పని దొరకని పరిస్థితి. ఇలా కొన్ని గ్రామాల్లో నీటికరువుతో ప్రజలు అల్లాడుతున్నారు. అటువంటి ఓ గ్రామమే దేశ ఆర్థికరాజధాని ఉన్న రాష్ట్రంలోనే ఉంది. కానీ చుక్కనీటి కోసం అల్లాడుతోంది. త్రాగడానికి గుక్కెడు నీళ్లు లేక అలమటిస్తున్నారు అక్కడి ప్రజలు. మహారాష్ట్రలోని ఖాదియల్ గ్రామం నీటికరువుతో కటకటలాడుతోంది. మండుటెండలో దాహం తీర్చుకునేందుకు చెమటోడ్చుతున్నారు ఇక్కడి గిరిజన ప్రజలు.  గ్రామంలో ఉన్న రెండు బావులు ఎండిపోయాయి. అయితే అధికారులు ట్యాంకర్ల ద్వారా నీటిని  తెచ్చి బావుల్లో పోస్తున్నారు. దీంతో స్థానికులు బావి అంచున నిలబడి వందల బిందెలతో నీటిని తోడుకుంటు దృశ్యాలు అందరినీ కలిచివేస్తున్నాయి. 

ఇక మహారాష్ట్ర లోని నాసిక్ లో నీటి చుక్క కోసం జనాలు పడుతున్న కష్టాలు ఎన్నో.  ప్రాణాలకు తెగించి..బావిలోంచి  నీటిని తోడుకోవాల్సిన పరిస్థితి.  మహిళలు నీళ్లు తెచ్చుకోవడానికి కిలో మీటర్ల మేర నడుచుకుంటూ వెళాల్సిన దుస్థితి. అవి స్వచ్ఛమైన నీళ్లా అంటే కావు. బురద నీటిని బట్టలో వడపోసి తీసుకొని వెళుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. లోతైన బావిలో ఓ వ్యక్తి దిగగా.. పైన ఉన్న వాళ్లు తాళ్ల సహయంతో కిందకు బిందెలు, చిన్నపాటి ప్లాస్టిక్ డ్రమ్ములను వదులుతుండడం కనిపిస్తోంది. పైకి లాగిన తర్వాత.. బుదర నీటిని వేరే దానిలో పోసుకుంటున్నారు. నెత్తిపై బిందెలను పెట్టుకుని.. సుమారు మూడు కిలో మీటర్ల దూరం నడుచుకుంటూ వెళుతున్నారు. 

ఇవి మచుకకు కొన్ని మాత్రమే. చాలా రాష్ట్రాల్లో ఇలాగే పరిస్థితి. పాలకులు చెబుతున్న అభివృద్ధికి నిదర్శనంగా నిలుస్తున్నాయి ఈ ప్రాంతాలు. స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లు కావొస్తున్న  దేశంలో ఇటువంటి పరిస్థితులు ఇంకా ఉండడం సిగ్గుచేటని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంతసేపు పాలకులు గొప్పలు చెప్పుకోవడం మాని తడారిన గొంతులకు నీరందించాలి. ఇప్పటికైతే అలా అందిస్తారనే ఆశిద్దాం..