నాగార్జున సాగర్​కు రెండు లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో 

నాగార్జున సాగర్​కు రెండు లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో 
  • 527 అడుగులకు చేరిన  నీటిమట్టం  
  • రేపు ఎడమ కాల్వకు నీటి విడుదల

హాలియా, వెలుగు: ఎగువ నుంచి వస్తున్న భారీ వరదతో నాగార్జునసాగర్​నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. శ్రీశైలం ద్వారా, కుడి, ఎడమ గట్టు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ద్వారా 2,83,360 క్యూసెక్కులను నాగార్జునసాగర్ కు వదులుతున్నారు. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 575 అడుగులు(312.5050 టీఎంసీలు) కాగా, బుధవారం సాయంత్రానికి 527 అడుగుల(161.9689 టీఎంసీలు)కు చేరుకుంది.

కుడికాల్వకు 5944 క్యూసెక్కులు, ఎస్ఎల్బీసీకి 800 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ఇన్​ఫ్లో 2,18,622 క్యూసెక్కులు వస్తుండగా, 6,844 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. వరద ఇలాగే కొనసాగితే వారం, పది రోజుల్లో నాగార్జునసాగర్ నిండే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు వెల్లడించారు. కాగా, సాగర్ కు వస్తున్న భారీ ఇన్​ప్లో నేపథ్యంలో శుక్రవారం ఎడమ కాల్వకు సాగునీటిని విడుదల చేయనున్నారు. 

శ్రీశైలానికి స్వల్పంగా తగ్గిన వరద

శ్రీశైలం: శ్రీశైలం ప్రాజెక్టుకు స్వల్పంగా వరద తగ్గింది. మంగళవారం రాత్రి నుంచి బుధవారం మధ్యాహ్నం వరకు పది గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేసిన ఆఫీసర్లు, బుధవారం సాయంత్రం రెండు గేట్లను బంద్​ చేసి ఎనిమిది గేట్ల ద్వారా నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం ప్రాజెక్టుకు జూరాల నుంచి 2,77,557 క్యూసెక్కులు, సుంకేసుల బ్యారేజి నుంచి 16,256 క్యూసెక్కులు కలుపుకొని మొత్తం 2,93,813 క్యూసెక్కుల ఇన్​ ఫ్లో నమోదవుతోంది.

శ్రీశైలం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులకు గాను ప్రస్తుతం 884.50 అడుగుల్లో నీరు ఉంది. పూర్తి కెపాసిటీ 215.8070 టీఎంసీలకు గాను 212.9198 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్​ ఉత్పత్తిని కొనసాగిస్తున్నారు. మొత్తంగా ప్రాజెక్టు నుంచి 2.84 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.