- 60 ఏండ్ల కిందిది కావడంతో రిపేర్లు చేయాలన్న ఎక్స్పర్ట్స్
- స్పిల్ వేలో పగుళ్లతో సమస్య
- 2 నెలల నుంచి నీళ్లు వదిలేస్తున్న ఇరిగేషన్
- ఉన్నవి 6.550 టీఎంసీలు మాత్రమే
- మరో 12 అడుగులు తగ్గితే పంపింగే..
హైదరాబాద్‌సిటీ, వెలుగు: నగరానికి తాగునీరందిస్తున్న సింగూరు జలాశయంలో నీటిమట్టం పూర్తిగా తగ్గిపోయింది. దీంతో పంపింగ్ ద్వారా నీటిని తెచ్చేందుకు వాటర్‌బోర్డు ఏర్పాట్లు చేస్తోంది. జంటనగరాలకు వివిధ రిజర్వాయర్ల నుంచి 580 ఎంజీడీల నీళ్లు వస్తుండగా..సింగూరు నుంచే 70 ఎంజీడీలు తీసుకువస్తున్నారు. ఈ జలాశయం పూర్తి కెపాసిటీ 29.917 టీఎంసీలు కాగా, గత ఏడాది ఈ టైంకు 19.232 టీఎంసీల నీళ్లు ఉండె.. కానీ, రిపేర్లు చేయాల్సిన అవసరం ఉండడంతో రెండు నెలల నుంచి ఇరిగేషన్అధికారులు ఖాళీ చేస్తున్నారు. హైదరాబాద్తాగునీటి అవసరాల కోసం 6.550 టీఎంసీలను ఉంచారు. మరికొద్ది రోజుల్లో 4 టీఎంసీలకు చేరుకుంటే పంపింగ్చేయాల్సిన పరిస్థితి ఉంటుంది.
ఈ నెలాఖరు నుంచే..
సింగూరు డ్యామ్నిర్మించి 60 ఏండ్లు దాటిన నేపథ్యంలో కొంతమేర శిథిలావస్థకు చేరుకుంది. దీంతో పూర్తి కెపాసిటీ నీళ్లు నిల్వ చేసే పరిస్థితి లేదు. అంతేగాకుండా డ్యామ్‌నుంచి నీరు పారే స్పిల్‌వేలో పగుళ్లు రావడం, చాలా ఏండ్లుగా రిపేర్లు చేయక పోవడంతో ప్రమాదకర స్థితికి చేరుకుంది. నిపుణుల కమిటీ కూడా రిపేర్లు చేయాలని స్పష్టం చేయడంతో ఇరిగేషన్అధికారులు డ్యామ్‌ను ఖాళీ చేస్తున్నారు.
వ్యవసాయ అవసరాలకు నీటిని విడుదల చేస్తున్నారు. గత ఏడాది ఇదే సమయానికి 19.230 టీఎంసీలుండగా, ఇప్పుడు 6.550 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతం సిటీ డ్రింకింగ్వాటర్కోసం రోజూ 70 ఎంజీడీలు తీసుకువస్తున్నారు. మరో12 అడుగులు తగ్గితే పంపింగ్చేయాల్సి ఉంటుందని వాటర్‌బోర్డు అధికారులు చెప్తున్నారు. తమ అంచనా ప్రకారం నెలాఖరులోపే పంపింగ్మొదలవుతుందంటున్నారు. సింగూరులో ఇప్పుడన్న నీళ్లు జూన్ వరకూ సరిపోయే విధంగానే ఉన్నాయని, ఒకవేళ సకాలంలో వర్షాలు కురవకపోతే తిప్పలు తప్పవంటున్నారు.
రిపేర్లలో ఆలస్యం..
సింగూరు డ్యామ్రిపేర్ల విషయంలో ఇరిగేషన్అధికారులు కాలాయాపన చేస్తున్నారు. నిపుణుల కమిటీ ఫుల్కెపాసిటీ నీళ్లను ఉంచితే ప్రమాదకరమని చెప్పడంతో నీళ్లను వేగంగా ఖాళీ చేస్తున్నారు. కానీ, రిపేర్ల విషయాన్ని సీరియస్‌గా తీసుకోవడం లేదని తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటివరకూ మరమ్మతులకు సంబంధించి టెండర్లు కూడా పిలవలేదు. మరో రెండు మూడు నెలలు రిపేర్లు చేయకుండా వదిలేస్తే వర్షాలు కురిసినా నీళ్లను వదిలేయాల్సిన పరిస్థితే ఉంటుంది. సర్కారు స్పందించి తొందరగా రిపేర్లు చేయించాలని కోరుతున్నారు.

