ఆదుకోమని అడిగితే కొడతారా..? బంగారు తెలంగాణ అంటే ఇదేనా..?

ఆదుకోమని అడిగితే కొడతారా..? బంగారు తెలంగాణ అంటే ఇదేనా..?

వరద బాధితుల ఆగ్రహం..

మంత్రి కేటీఆర్ పర్యటనలో ఉద్రిక్తత

హైదరాబాద్ఎ, ఎల్బీ నగర్, వెలుగు: రెండు రోజుల నుంచి కురుస్తున్న వానలు, ముంచెత్తుతున్న వరదలతో తమ బతుకులు ఆగమయ్యాయని, పట్టించుకునే దిక్కు లేకుండా పోయిందని హైదరాబాద్​ బైరామల్​ గూడలోని  వరద బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి కేటీఆర్​కు గోడు చెప్పుకుందామని వస్తే.. పోలీసులు ఇష్టమున్నట్లు కొట్టారని వారు  రోడ్డుమీద ధర్నాకు దిగారు. స్థానిక ఎమ్మెల్యే సుధీర్​రెడ్డి ఒక్కసారి కూడా తమ కాలనీకి రాలేదని, చిన్న వర్షం పడినా తాము భయం భయంగా బతకాల్సి వస్తున్నదని కన్నీళ్లు పెట్టుకున్నారు.  ఎల్బీనగర్​లోని పలు వరద ప్రాంతాలను బుధవారం సాయంత్రం మంత్రులు కేటీఆర్, మహమూద్​ అలీ, స్థానిక ఎమ్మెల్యే సుధీర్​రెడ్డి తదితరులు పరిశీలించారు. బైరామల్​గూడలో వాళ్లు పర్యటిస్తుండగా.. స్థానికులు తమ గోడు చెప్పుకునేందుకు మంత్రి కేటీఆర్​ దగ్గరకు వెళ్లారు.  వారిని పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. తమ బాధను చెప్పుకునే స్వచ్ఛ లేదా…? అని స్థానికులు మండిపడ్డారు. ‘‘ఒకవైపు వరదతో నరకం అనుభవిస్తున్నం. కంటిమీద కునుకు లేదు. మరోవైపు న్యాయం చేయుండ్రని వెళ్తే మా మీదనే పోలీసులు దాడి చేస్తుండ్రు. గిదెక్కడి న్యాయం? గిదా బంగారు తెలంగాణ అంటే..?” అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కొట్టించేందుకు వచ్చిండ్రా?

కేటీఆర్​ అక్కడి నుంచి వెళ్లిపోగా.. స్థానికులు రోడ్డుపై ధర్నాకు దిగారు. తమపై పోలీసులు దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేస్తూ.. సీఎం కేసీఆర్​, మంత్రి కేటీఆర్​ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ‘‘మమల్మి కొట్టించేందుకే కేటీఆర్​ పర్యటనకు వచ్చిండా? మా పిల్లలను పోలీసులు కొట్టిండ్రు. మమ్మల్ని చంపుతారా?” అని కన్నీళ్లు పెట్టుకున్నారు. వరద బాధితులందరినీ  ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్​ చేశారు.

మా ఎమ్మెల్యే ఎన్నడైనా కనిపించిండా?

కొంత మంది స్థానికులతో మంత్రి కేటీఆర్​ మాట్లాడారు. అక్కడ ఉన్న సమస్యలను అడిగి తెలుసుకొని.. ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. నీట మునిగిన ఇండ్ల నుంచి బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించి వరద నీటిని వెంటనే ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళేట్లు చర్యలు తీసుకోవాలని ఆఫీసర్లను ఆదేశించారు. అదే సమయంలో కొంతమంది స్థానికులు.. ‘‘లోకల్​ ఎమ్మెల్యే సుధీర్​రెడ్డి ఎన్నడైనా ఇక్కడ కనిపించిండా? మా బాధలు ఎప్పుడైన విన్నడా?” అని కేటీ‌‌ఆర్ ముందు గోడు వెళ్లబోసుకున్నారు. ‘‘రాత్రి నుంచి మేము వరదలో ఉంటే ఏ ఒక్కరు స్పందించలేదు.  ఇప్పుడు మీరు వస్తున్నరని ఎమ్మెల్యే, లోకల్​ లీడర్లు హడావుడి చేస్తున్నరు. మా ఇండ్లన్నీ నీళ్లలో మునిగి నిలువ నీడ లేకుండా పోయింది” అని ఆవేదన వ్యక్తం చేశారు. ఏటా వరద పొంగుతున్నదని, తమ సమస్యల శాశ్వత పరిష్కారానికి రెండురోజుల్లో స్పష్టమైన హామీ ఇవ్వాలని మంత్రి కేటీఆర్​ను డిమాండ్​ చేశారు. న్యాయం చేస్తామని కేటీఆర్​ వారికి సర్దిచెప్పారు.