50వేల లోపున్న రుణాలు మాఫీ చేస్తున్నాం

50వేల లోపున్న రుణాలు మాఫీ చేస్తున్నాం
  • వచ్చే ఏడాది లోగా 50వేల పైన, లక్ష లోపు రుణాలను వడ్డీతో సహా మాఫీ చేస్తాం
  • 57ఏళ్ల లోపున్న 4 లక్షల మందికి త్వరలో ఆసరా ఫించన్లు మంజూరు చేస్తాం
  • ఆర్ధిక మంత్రి హరీష్ రావు వెల్లడి

హనుమకొండ: 50వేల లోపున్న రుణాలు మాఫీ చేస్తున్నామని.. అంతేకాదు.. వచ్చే ఏడాది లోగా రూ.50వేల పైన, రూ.లక్ష లోపు రుణాలను వడ్డీతో సహా మాఫీ చేస్తామని ఆర్ధిక మంత్రి హరీష్ రావు వెల్లడించారు. 57ఏళ్ల లోపున్న 4 లక్షల మందికి త్వరలోనే ఆసరా ఫించన్లు మంజూరు చేయబోతున్నామని ఆయన తెలిపారు. కమలాపూర్ మండల స్థాయి టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. మీ ఆత్మీయ స్వాగతం చూసాక.. నా గుండె పులకరించింది.. మీ రుణం తీర్చుకుంటానన్నారు. అమ్మకానికి పెట్టింది పేరు బీజేపీ అయితే.. టీఆర్ఎస్ నమ్మకానికి పెట్టింది పేరు అన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో గెల్లు శ్రీనివాస్ విజయం ఖాయమని, తేలాల్సింది మెజార్టీ మాత్రమేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 
ఈటల రాక ముందు జెండా ఎగిరింది.. పోయాక కూడా ఎగిరేది గులాబీ జెండానే
ఈటల రాజేందర్ పార్టీలో చేరకముందే.. ఇక్కడ గులాబీ జెండా ఎగిరిందని, ఆయన పార్టీ విడిచిపెట్టి వెళ్లిపోయిన తర్వాత కూడా  గులాబీ జెండానే ఎగురుతుందని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. బోనాలకు వెళ్లిన వాళ్లకు మేక పిల్లలు, ఫుల్ బాటిల్లు ఈటల పంపించాడు,  ఇన్నేళ్లు పంపంది ఇప్పుడెందుకు పంపిస్తున్నాడని ఆయన ఎద్దేవా చేశారు. ఇంతకాలం నీకు ఓట్లు వేసింది.. గులాబీ జెండా చూసే తప్ప.. నీ బలం చూసి కాదని హరీష్ రావు పేర్కొన్నారు. నీ వెంట నాయకులు ఉన్నారంటే.. కేవలం కేసీఆర్ వల్ల, టీఆర్ఎస్ వల్ల మాత్రమేనన్నారు. 2004లో ఈటల రాజేందర్ పోటీ చేసినప్పుడు.. ఇక్కడ బలమైన నేతగా ముద్దసాని దామోదర్ రెడ్డి ఉండేవాడు, ఆయన మీద ఈటల గెలుస్తడా అనుకున్నారు.. కానీ గులాబీ జెండా అండతో గెలిచాడు, ఇప్పుడు కూడా ఈటలపై .. గెల్లు శ్రీను గెలుస్తాడా అని కొందరికి అనుమానం ఉంది, గెల్లు శ్రీనివాస్ కు గులాబీ జెండా అండగా ఉంది కాబట్టి.. గెలిచి తీరుతాడని ఆయన స్పష్టం చేశారు. బీజేపీలోకి  వెళ్తే గెలుస్తాననుకుంటున్నాడు ఈటల, కానీ ఆ పార్టీ మనకు ఏం చేసిందని ఆయన ప్రశ్నించారు. తలసరి ఆదాయంలో మన రాష్ట్రం దక్షిణ భారత దేశంలో మనం నెంబర్ వన్ గా ఉందని, అలాగే జీఎస్డీపీలో, విద్యుత్ వినియోగంలో కూడా మనమే నెంబర్ వన్ అన్నారు. 
బంగ్లాదేశ్ కంటే దీనంగా భారత ఆర్ధిక పరిస్థితి
మన పొరుగున ఉన్న చిన్న మిత్ర దేశం బంగ్లాదేశ్ ఆర్థిక పరిస్థితి కంటే.. బీజేపీ పాలనలో ఇండియా ఆర్థిక పరిస్థితి దిగజారిందని తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక మంత్రి హరీష్ రావు ఆరోపించారు. కాజీపేటలో కోచ్ పార్టీ ఏర్పాటు చేస్తామని చెప్పి మాట తప్పిన పార్టీ బీజేపీయేనని ఆయన విమర్శించారు. రాష్ట్ర విభజన చట్టంలో హామీ ఇచ్చిన గిరిజన యూనివర్శిటీ కూడా ఇంత వరకు ఇవ్వలేదన్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలను అమ్మేందుకే కేంద్రంలో ఓ శాఖను ఏర్పాటు చేశారని ఆయన ఎద్దేవా చేశారు. ఉన్న ఉద్యోగాలు కూడా బీజేపీ ఊడగొడుతోందని మంత్రి హరీష్ రావు ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టును మూడున్నరేళ్లలో పూర్తి చేసి రైతులకు నీళ్లిస్తే.. బీజేపీ ఏమిచ్చింది ? ధరలు పెంచుడు తప్ప.. ఆ పార్టీ చేసిందేమీ లేదని ఆయన విమర్శించారు. 
ఒక్క ఇల్లు కట్టలేదు.. మాట్లాడితే నా సొంత మండలం అంటాడు
మాట్లాడితే కమలాపూర్ నా సొంత మండలమంటాడు ఈటల. ఇక్కడ ఒక్క ఇళ్లైనా కట్టావా ? అని మంత్రి హరీష్ రావు నిలదీశారు. ఈ మండలానికి వెయ్యి ఇండ్లు కేటాయిస్తే... ఒక్కరిని కూడా ఇంటిలోకి పంపించలేకపోయాడని ఆయన ఎద్దేవా చేశారు. పేదోళ్లు ఇక్కడ ఇండ్లు కట్టుకుంటే జేసీబీలతో కూలగొట్టించిన చరిత్ర ఆయనదని మంత్రి హరీష్ రావు ఆరోపించారు. సొంతజాగాలో ఇండ్లు కట్టించే సత్తా మాకుందా.. ఈటలకు ఉందా? అని ఆయన ప్రశ్నించారు. ఈటలకు టీఆర్ఎస్ పార్టీ ఏం తక్కువ చేసింది..?  ముఖ్యమంత్రి పదవి తప్ప..అన్ని పదవులిచ్చింది టీఆర్ఎస్, కానీ ఇవాళ పార్టీకి ద్రోహం చేశాడని ఆరోపించారు. ఇన్ని చేసినా తల్లి పాలుతాగి రొమ్ము కొట్టినట్లుగా ఈటల వ్యవహరించారని విమర్శించారు.  గెల్లు శ్రీనును గెలిపించండి.. రాబోయే రోజుల్లో మీ వెంట మేముంటామని ఆయన హామీ ఇచ్చారు. 
కోతలు, వాతలు తప్ప రైతులకు ఏమిచ్చింది బీజేపీ
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కోతలు, వాతలు తప్ప రైతులకు ఏమిచ్చిందని రాష్ట్ర ఆర్ధిక మంత్రి హరీష్ రావు  ప్రశ్నించారు. రేపు వడ్లు కొననంటోంది, ఎరువుల ధరలు పెంచిందని ఆరోపించారు. ఆత్మగౌరవం గురించి మాట్లాడేవాళ్లు.. బొట్టు బిల్లలు, గోడ గడియారాలు పంచుతారా? అని ప్రశ్నించారు. బీజేపీ కార్మిక విభాగమైన బీఎంఎస్ కార్మిక సంఘమే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకాన్ని వ్యతిరేకిస్తోందని ఆయన తెలిపారు. అమ్మకానికి పెట్టింది పేరు బీజేపీ.. నమ్మకానికి పెట్టింది పేరు టీఆర్ఎస్ అన్నారు. 
ఆరు లక్షల కోట్ల ప్రభుత్వ ఆస్తులు అమ్ముతున్నారు
ఆరు లక్షల కోట్ల ప్రభుత్వ ఆస్తులు అమ్ముతున్నామని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారని ఆయన నొక్కి చెప్పారు. ఏ ప్రభుత్వమైనా ఆస్తులు కూడబెట్టాలి కానీ.. అమ్ముతుందా? అని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు రూపంలో కేసీఆర్ ఈ రాష్ట్రానికి పెద్ద ఆస్తిని సమకూర్చారని పేర్కొన్నారు. ఇంకో 20 ఏళ్లు అధికారంలో ఉండే పార్టీ టీఆర్ఎస్ అని,  ఏ పార్టీ కూడా మనకు సరిరాదన్నారు. 
టీఆర్ఎస్ తర్వాత.. కేవలం నెంబరు 2 కోసమే.. వాళ్ల ప్రయత్నాలు
తెలంగాణలో టీఆర్ఎస్ తర్వాత నెంబర్ 2 కోసమే వాళ్ల ప్రయత్నాలు జరుగుతున్నాయని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ ఒక్కటేనని కాంగ్రెస్ అంటుంటే... కాంగ్రెస్, టీఆర్ఎస్ ఒక్కటేనని బీజేపీ అంటోందన్నారు. ఈ పార్టీలతో మేము ఒక్కటి కానే కాము.  మా హై కమాండ్ మా ప్రజలేనన్నారు. పార్టీలతో కుమ్ముక్కు అయ్యే సంస్కృతి కేవలం బీజేపీ, కాంగ్రెస్ లకే చెల్లుతుందన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలే ఎజెండాగా పనిచేసే పార్టీ టీఆర్ఎస్ అని మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు.