- వేములవాడ, సిరిసిల్లలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం
- హాజరైన మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, విప్ ఆది శ్రీనివాస్
రాజన్న సిరిసిల్ల, వెలుగు : 'నేతన్నలకు బీఆర్ఎస్ పెట్టిపోయిన బకాయిలన్నీ కట్టినం. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరాక రూ. 370 కోట్ల బకాయిలను విడుదల చేసినం. సిరిసిల్ల నేతన్నలను ఆదుకునేందుకు ఇందిరా మహిళా శక్తి కింద చీరల ఉత్పత్తి ఆర్డర్లు ఇచ్చాం. రాష్ట్రంలో రైతన్నలకు ఇచ్చే ప్రయోజనాలను నేతన్నలకు కూడా ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి కోరా' అని వ్యవసాయ, చేనేత సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు.
మంత్రి పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తో కలిసి గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. ముందుగా ఉదయం 9 గంటలకు రాజన్నను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం వేములవాడ ఆలయ గుడి చెరువు బండ్ పార్క్ ను, సిరిసిల్ల రగుడు జంక్షన్ వద్ద నిర్మించిన నేతన్న విగ్రహాలను మంత్రులు ఆవిష్కరించారు. అనంతరం సిరిసిల్ల కలెక్టరేట్ లో జరిగిన సమావేశానికి హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ నేతన్నల కష్టానికి ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. గత రెండేండ్లలోనే చేనేత రంగానికి రూ.1,360 కోట్లకుపైగా ఇచ్చామని గుర్తు చేశారు. నేతన్నలకు ఏడాది పొడవునా పని కల్పించడంతో పాటు భద్రత, బీమా, సంక్షేమ పథకాల అమలుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పారు. యారన్ డిపో ఏర్పాటుతో చేనేత సహకార సంఘాలకు మరింత ప్రయోజనం కలుగుతుందన్నారు.
నేతన్నల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, కలెక్టర్ గరిమా అగ్రవాల్, ఎస్పీ మహేశ్ బి. గీతే, మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరాంచక్రవర్తి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, అడిషనల్ కలెక్టర్ గడ్డం నగేశ్, మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ స్వరూప పాల్గొన్నారు.
జిల్లా అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం : మంత్రి అడ్లూరి లక్ష్మణ్
రాజన్న సిరిసిల్ల జిల్లా అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చెప్పారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం నెరవేర్చుతోందన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు సిరిసిల్ల ప్రాంత అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకారం అందిస్తోందని, నేతన్నల సంక్షేమం కోసం మరిన్ని చర్యలు చేపడతామని చెప్పారు.
నాణ్యమైన చీరల అందిస్తున్నం : మంత్రి పొన్నం ప్రభాకర్
సిరిసిల్లలో నాణ్యమైన ఇందిరా మహిళా శక్తి చీరలు తయారవుతున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. నేతన్న, గీతన్న వేరు కాదని, సిరిసిల్ల నేతన్నలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మహిళలకు అందుబాటు ధరలో సిరిసిల్ల మోడల్ చీర ఒకటి తయారు చేసి జీఐ ట్యాగ్ వచ్చేలా కృషి చేయాలని సూచించారు.
చీరల ఆర్డర్లతో వేలాది మందికి ఉపాధి : ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వస్త్ర పరిశ్రమలో పేరుకుపోయిన బకాయిలను దశల వారీగా విడుదల చేశామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మూడు కోట్ల మీటర్ల చీరల తయారీకి ఆర్డర్లు ఇచ్చామని, ఇందులో ఇప్పటికే సుమారు కోటి మీటర్ల చీరల ఉత్పత్తి పూర్తైందని చెప్పారు. నేతన్నల అభ్యున్నతికి ప్రభుత్వం అనేక కీలక నిర్ణయాలు తీసుకుందని చెప్పారు. కామన్ ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటు కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని
చెప్పారు.
