మున్సిపల్​ ప్రీ పోల్స్​ ప్రక్రియ చట్టానికి లోబడే

మున్సిపల్​ ప్రీ పోల్స్​ ప్రక్రియ చట్టానికి లోబడే

హైదరాబాద్‌, వెలుగు: రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించాలనే చిత్తశుద్ధితో రాష్ట్ర ప్రభుత్వం ఉందని, ఇందుకోసం చట్ట నిబంధనలకు లోబడే ముందస్తు ఎన్నికల ప్రక్రియను చేశామని, రాత్రికి రాత్రి చేశామనడం సబబు కాదని మున్సిపల్​ శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌ కుమార్‌ హైకోర్టుకు నివేదించారు. మున్సిపల్‌ ఎన్నికల ముందస్తు ప్రక్రియ చట్ట విరుద్ధంగా జరిగిందని నిర్మల్‌ జిల్లాకు చెందిన అంజుకుమార్‌ రెడ్డి, మేడ్చల్‌ జిల్లాకు చెందిన మరో వ్యక్తి వేర్వేరుగా వేసిన పిల్స్‌పై ప్రభుత్వం కౌంటర్‌ పిటిషన్‌ వేసింది. కౌంటర్‌ పిటిషన్‌లో అన్ని వివరాలు ఉన్నాయని, దీనిపై గురువారం విచారణ జరపాలని అదనపు ఏజీ జె.రామచందర్‌ రావు డివిజన్‌ బెంచ్‌ను కోరారు. ఒక్క రోజు వ్యవధిలోనే పిటిషనర్ల వాదనలు చెప్పాలనబోమని, వివరంగా పిటిషనర్లు వాదించేందుకు వీలుగా కేసును నెలాఖరుకు వాయిదా వేస్తున్నట్లు చీఫ్​ జస్టిస్‌ ఆర్ఎస్​ చౌహాన్, జడ్జి జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌తో కూడిన డివిజన్‌ బెంచ్‌ తెలిపింది. విచారణ ఈ నెల 28కి వాయిదా పడింది.