
- పదవులను గడ్డిపోచల్లా త్యజించినం
హైదరాబాద్, వెలుగు : సీఎం రేవంత్‌రెడ్డి సభను తప్పుదోవ పట్టిస్తున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు విషయంలో టీఆర్ఎస్ నాయకులు కొట్లాడలేదని రేవంత్ అంటున్నారని, అది కరెక్ట్ కాదని తెలిపారు. వైఎస్‌ఆర్ మంత్రి వర్గం నుంచి తాము తప్పుకున్నప్పుడు, తాము చెప్పిన ఆరు కారణాల్లో పోతిరెడ్డి పాడు కూడా ఉందన్నారు. కాంగ్రెస్ వల్ల తాము మంత్రులు కాలేదని, కాంగ్రెస్‌ను గెలిపించిందే టీఆర్‌ఎస్ పార్టీ అని హరీశ్ గుర్తు చేశారు. చచ్చిపోతున్న ఆ పార్టీకి కేసీఆర్ జీవం పోశారని హరీశ్ పేర్కొన్నారు. పదవులను తాము గడ్డి పోచల్లా త్యజించామని, తెలంగాణ కాంగ్రెస్ నాయకులు పదవుల కోసం మౌనంగా ఉన్నారని విమర్శించారు. మంత్రి శ్రీధర్‌బాబు కలగజేసుకుని.. గత పదేండ్లుగా కాంగ్రెస్ పాలనను విమర్శించారని, ఇప్పటికీ అదే చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్‌ఎస్ చెప్పిన అన్ని మాటలను విన్న తర్వాతనే ప్రజలు ఇందిరమ్మ రాజ్యం రావాలని కాంగ్రెస్‌ను గెలిపించారని స్పష్టం చేశారు. ‘‘ఇందిరమ్మ రాజ్యంలోనే ఇండ్లు వచ్చాయి, పోడు భూములు వచ్చాయి, సామాజిక న్యాయం జరిగిందని ప్రజలు గుర్తించారు.. మళ్లీ అదే రాజ్యం రావాలని ప్రజలు కోరుకున్నారు. టీఆర్‌ఎస్ కాంగ్రెస్‌ను గెలిపించలేదు. అప్పుడు మేము 99 సీట్లు గెలిచినం. బీఆర్‌ఎస్ గెలిచింది ఎంత, వాళ్ల సంఖ్య ఎంతో హరీశ్‌రావు గుర్తు చేసుకోవాలి.”అని శ్రీధర్‌బాబు కౌంటర్ వేశారు.
రేవంత్ రేపు ఎక్కడుంటరో తెల్వది
రేవంత్‌రెడ్డి ఒకప్పుడు ఏబీవీపీలో ఉండేవారని, ఆ తర్వాత టీఆర్‌ఎస్, అక్కడి నుంచి టీడీపీలో పని చేశారని, ఇప్పుడు కాంగ్రెస్‌లో ఉన్నారని, రేపు ఎక్కడుంటారో తెల్వదని హరీశ్‌రావు విమర్శించారు. తమ మీద విమర్శలు చేసే బదులు, ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై, పరిపాలనపై దృష్టి పెట్టాలని హరీశ్ సూచించారు. ఈ క్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ.. చీమలో పెట్టిన పుట్టలో పాములు దూరినట్టు, ఎంతో మంది నాయకులు తయారు చేసుకున్న కాంగ్రెస్ పార్టీలో దూరి రేవంత్‌రెడ్డి సీఎం అయ్యారని విమర్శించారు. అంతలోనే మంత్రి దామోదర రాజనర్సింహా కలగజేసుకుని.. తమ పార్టీలో ప్రజాస్వామ్యం ఉంటుందని, పార్టీలో ఎవరికైనా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందన్నారు. ఈ విషయం ప్రజలకు తెలుసు కాబట్టే, కాంగ్రెస్‌ను గెలిపించారన్నారు. అప్పులను సాకుగా చూపి ఆరు గ్యారంటీలను అమలు చేయకుండా ఎగ్గొట్టేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని కేటీఆర్ ఆరోపించారు. విద్యుత్ వ్యవస్థను తాము గాడిన పెట్టామని, అప్పులు చేసినప్పటికీ, ఆస్తులు సృష్టించామన్నారు. అవసరమైతే ఆస్తులు అమ్ముకొని, అప్పులు తీర్చొకోవచ్చునని కేటీఆర్ పేర్కొన్నారు.
ప్రతిపక్షానికి మాట్లాడే చాన్స్ ఇవ్వలే..
అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని, ప్రతిపక్షానికి కనీసం మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదని ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. శనివారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో బీఆర్ఎస్ఎమ్మెల్యేలతో కలిసి ఆయన మాట్లాడారు. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సమాధానం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై క్లారిఫికేషన్ కోసం మూడు సార్లు మైక్ ఇచ్చి కట్ చేశారని, కనీసం తమకు ప్రొటెస్ట్ చేసే అవకాశం కూడా ఇవ్వలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనికి నిరసనగా సభ నుంచి బయటకు వచ్చామని తెలిపారు. తమకు అవకాశం ఇవ్వకుండా సభ నుంచి ప్రభుత్వం పారిపోయిందని విమర్శించారు. సభలో ప్రభుత్వం అబద్ధాలను ప్రచారం చేసిందని, సత్యదూరమైన మాటలు చెప్పిందని ఆరోపించారు. తాము డెమోక్రాటిక్‌గా ఉంటామని మాటలు చెప్పారే తప్ప.. చేతల్లో అందుకు విరుద్ధంగా ప్రవర్తించారన్నారు. సభలో ప్రతిపక్షాల గొంతునొక్కే ప్రయత్నం తొలి రోజే చేశారన్నారు. మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు చనిపోతే కాంగ్రెస్ అగ్రనేతలు కనీసం నివాళులర్పించలేదని, ఆయన అంత్యక్రియలు చేసేందుకు ఢిల్లీలో గుంట జాగా కూడా ఇవ్వలేదని గుర్తుచేశారు. కుటుంబ పాలన గురించి మాట్లాడే నైతికత కాంగ్రెస్‌కు లేదని హరీశ్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పేరే రైఫిల్ రెడ్డి అని, ఉద్యమకారులపైకి తుపాకీ తీసుకొని పోయిన ఆయన.. అమరవీరుల గురించి మాట్లాడితే దెయ్యాలు వేదాలు వళ్లించినట్టు ఉందని ఎద్దేవా చేశారు.