
- ఏపీ సీఎం చంద్రబాబు వెల్లడి
- జూబ్లీహిల్స్ నుంచి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వరకు భారీ ర్యాలీ
హైదరాబాద్, వెలుగు: విభజన సమస్యల పరిష్కారం కోసమే తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితో భేటీ అయినట్టు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్, ఏపీలో ఎన్డీయే ప్రభుత్వాలు ఉన్నాయని, సిద్ధాంతపరంగా ఆలోచనలు వేరుగా ఉన్నప్పటికీ తెలుగుజాతి ప్రయోజనాల కోసం కలిసి పనిచేస్తామని చెప్పారు. ఏపీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్‌కు చంద్రబాబు తొలిసారి రాగా.. పార్టీ కార్యకర్తలు, నేతలు ఆయనకు ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడారు. ఏపీ సీఎంగా బాధ్యతలు స్వీకరించాక విభజన సమస్యలపై చొరవ తీసుకుని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి లెటర్రాశానని చెప్పారు. రెండు రాష్ట్రాల సీఎంల భేటీకి ఇదే ముందడుగని తెలిపారు. తన లెటర్‌కు సానుకూలంగా స్పందించిన రేవంత్‌తో శనివారం సాయంత్రం భేటీ అయ్యానని వివరించారు.
భారీ ర్యాలీగా వచ్చిన టీడీపీ అధినేత
నారా చంద్రబాబు నాయుడు జూబ్లీహిల్స్ లోని తన నివాసం నుంచి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వరకు కార్యకర్తలతో భారీ ర్యాలీగా తరలి వచ్చారు. తెలంగాణ టీడీపీ నేతలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఎన్టీఆర్ భవన్‌లో బాబును ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు అరవింద్ కుమార్‌గౌడ్, జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమోహన్ రావు, జాతీయ ఉపాధ్యక్షుడు చిలువేరు కాశీనాథ్, జాతీయ క్రమ శిక్షణ కమిటీ సభ్యుడు బంటు వెంకటేశ్వర్లు, అధికార ప్రతినిధులు నన్నూరి నర్సిరెడ్డి, ప్రేమ్ కుమార్ జైన్, టి.జ్యోత్స్, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కాట్రగడ్డ ప్రసూన, బండి పుల్లయ్య, నందమూరి సుహాసిని, తదితరులు పాల్గొన్నారు.